ల్యాప్ ట్యాప్ సౌకర్యవంతమైన పరికరం. కానీ దీని వాడకం కూడా ప్రమాదకరమేనని ఇటీవల ఘటనతో తేలిపోయింది. ల్యాప్‌టాప్‌కి చార్జింగ్ పెట్టి పనిచేస్తుండగా పేలిపోవడంతో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తీవ్రంగా గాయపడింది. వైఎస్సార్ కడప జిల్లాలోని బి.కోడూరు మండలంలో జరిగిందీ ఘటన. మేకవారిపల్లెకు చెందిన సుమలత (22) బెంగళూరులోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న సుమలత నిన్న ఉదయం 8 గంటలకు ల్యాప్‌టాప్‌కు చార్జింగ్ పెట్టి పనిచేస్తుండగా ఒక్కసారిగా అది పేలిపోయింది.
ఫలితంగా గదిలో మంటలు చెలరేగాయి. సుమలత దుస్తులకు మంటలు అంటుకోవడంతో ఆమె స్పృహ కోల్పోయింది. గదిలోంచి పొగలు వస్తుండడంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు లోపలికి వెళ్లి చూడగా సుమలత అపస్మారకస్థితిలో పడి వుంది. వెంటనే ఆమెను కడపలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మరింత మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి తిరుపతికి తరలించారు. శరీరం 80 శాతం కాలిపోవడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.