కోవిడ్ కాలంలోనూ సంక్షేమ పథకాలు నిరాంటకంగా కొనసాగించిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పారు. మంగళవారం రాత్రి మీడియాతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదేళ్ల వ్యవధిలో కల్పించాల్సిన సంక్షేమ ఫలాలను మూడేళ్లలో కల్పించినట్లు వివరించారు. పదేళ్లలో వారంతా తమ కాళ్ల మీద తాము నిలబడేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రస్తుతం ప్రభుత్వ బాధ్యతలతో పాటు పార్టీ బాధ్యతలను కూడా వైఎస్ జగన్ మోస్తున్నారన్నారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా 26 జిల్లాలను ఏర్పాటు చేశారని, 26 జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించారని వెల్లడించారు. జూలై 8న పార్టీ ప్లీనరీ జరగనుందని తెలిపారు. ఆలోపు బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని పటిష్టం చేయాలని నాయకులకు సూచించామన్నారు. ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌ఛార్జిలు గడపగడపకూ వెళ్లాలని పేర్కొన్నారు. అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించి, ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని ప్రజలకు వివరించాలన్నారు.