వేసవికాలం వచ్చిందంటే సామాన్య, పేద, మధ్య తరగతి వారు నిమ్మపండు ఎక్కువగా వినియోగిస్తారు. ప్రతి ఇంట్లో మహిళలు, వృద్ధులు, చిన్నారులకు వడదెబ్బ తగలకుండా ఉండటానికి, వేసవి తాపాన్ని తగ్గించుకునేందుకు నిమ్మకాయ రసంలో ఉప్పు లేదా పంచదారను కలిపి సేవిస్తూ ఉంటారు. ఈ ఏడాది ప్రారం భం నాటినుండి సమృద్దిగా నిమ్మకాయలు మార్కెట్లోకి రాకపోవడంతో నిమ్మకాయ ధరలు ఆకాశాన్ని అంటుకున్నాయి. పెద్ద సైజు నిమ్మకాయలు గతంలో డజను రూ. 25 లు ఉండగా ప్రస్తుతం మార్కెట్లో రూ. 80 నుండి రూ. 100లవరకు ఒక మాదిరి సైజునిమ్మకాయలను రూ. 60 నుండి రూ. 80లవరకు వ్యాపారస్తులు విక్రయిస్తున్నారు. దీంతో సామాన్యులకు అందని ద్రాక్షలా తయారైంది.
పెరిగిన నిమ్మరసం ధర వేసవిలో వివిధ పనుల నిమత్తం ఎండలో తిరిగే ద్విచక్రవాహన దారులు, రోడ్డు పక్కన వివిధ ప్రాంతాల్లో నిమ్మకాయ షరబత్ ను లేదా నిమ్మరసాలను సోడాతో తీసుకుని ఎండవేడిమి నుండి ఉపశమనం పొందుతుంటారు. గతంలో రూ. 10 ల నుండి రూ. 15 లకు నిమ్మకాయ సోడా అమ్ముతుంటే నేడు నిమ్మరసం రూ. 25 ల నుండి రూ. 30లవరకు విక్రయిస్తున్నారు. శీతలపానీయాలైన వివిధ కంపెనీల కోకోకోలా, ధమ్సట్లు ముప్పావు లీటరుతో సమానంగా నిమ్మరసం గ్లాసు ధర చేరుకుంది. తగ్గిన దిగుబడులు తోటల్లో తెగుళ్ల వలన దిగుబడులు తగ్గాయి.
సాధారణంగా నిమ్మ తోటల్లో డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు వివిధ రకాల తెగుళ్ల వలన నిమ్మకాయ దిగుబడులు తగ్గాయని వ్యాపారస్తులు పేర్కొంటున్నారు. తగ్గిన దిగుబడులతో మార్కెట్లో గిరాకి ఉండటం వలన రేట్లు అమాంతం పెంచి తోటల వారు విక్రయిస్తున్నారని, హోల్ సేల్ నుండి గతంలో ఎన్నడూ లేని విధంగా నిమ్మకాయలను కొనుగోలు చేసి విక్రయిస్తున్నట్టు తెలిపారు.
గతంలో ఒక్కొక్క వినియోగదారుడు డజును నుండి రెండుఏ డజన్ల వరకు కొనుగోలు చేసేవారని కానీ, నేడు ఆ పరిస్థితి లేదని అరడజను కాని లేదా డజను వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని వ్యాపారస్తులు తెలుపుతున్నారు. వివిధ పట్టణాల్లో, నగరాల్లో వారికున్న అవసరాన్ని బట్టి నిమ్మకాయలను స్వల్ప తేడాలతో ఒక మాదిరి కాయను రూ. 5 లకు పైగా రూ. 8ల వరకు విక్రయిస్తున్నారు.