పంజాబ్లోని లుథియానాలో బుధవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవ దహనం అయ్యారు. ఉపాధి కోసం వారంతా లుథియానాకు వలస వచ్చినట్లు తెలుస్తోంది. రాత్రి నిద్రపోతున్న సమయంలో ఇంటికి మంటలంటుకున్నాయని, క్రమంగా అవి పెద్దవి కావడంతో బాధితులు అందులో చిక్కుకుపోయారని పోలీసులు తెలిపారు. మృతుల్లో దంపతులతో పాటు నలుగురు కుమార్తెలు, ఏడాది వయసున్న కుమారుడు ఉన్నారు. వీరి మరో కుమారుడు రాజేష్(17) వేరు ప్రాంతంలో నిద్రించడంతో అతడొక్కడే కుటుంబంలో సజీవంగా మిగిలాడు. తెల్లవారుజామున 3 గంటలకు ప్రమాదం జరిగిందని పోలీసులు అంచనా వేస్తున్నారు.