అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌లో ఎట్టకేలకు గుమస్తాల బదిలీలు జరిగాయి. అయితే వీటిపై పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా సిఫార్సులు ఉన్న వారికే పెద్దపీట వేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఏళ్ల తరబడి ఒకే సీట్లో కొనసాగుతున్న వారికి బదిలీల్లో మార్పు జరుగుతుందని ఆశించిన వారికి చుక్కెదురైంది.
రెవెన్యూ విభాగంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ బదిలీల్లో మినిస్టీరియల్ విభాగంలోని గుమస్తాలకు అవకాశం దక్కలేదు. రెవెన్యూ ఇన్స్‌పెక్టర్లపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో రెండు నెలలకుపైగా బదిలీల వ్యవహారంపై నాన్చుడు ధోరణి కన్పిస్తోంది.
ప్రస్తుత బదిలీల ప్రక్రియలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చర్యలు లేకపోగా పరస్పర బదిలీలతో ఉన్నతాధికారులు ఈ తతంగాన్ని మమ అనిపించారు. రెవెన్యూ ఇన్స్‌పెక్టర్లు అబ్దుల్ రజాక్, రాజేంద్ర ప్రసాద్ బాబులను గుమాస్తాలుగా బదిలీ చేశారు. అబ్దుల్ రజాక్‌ను అకౌంట్స్ విభాగంలో బిఫోర్‌క్లర్క్‌గా నియమించారు. రాజేంద్రప్రసాద్ బాబును రెవెన్యూ విభాగంలోకి మార్చారు. వారి స్థానంలో రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌గా పద్మలతను నియమించారు.
గుమాస్తాగా ఇన్‌ఛార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ పి. వేణుగోపాల్‌ను యుడిఆర్‌ఐగా నియమించారు. వేణుగోపాల్‌ను ఇన్‌ఛార్జి గుమస్తా బాధ్యతల నుంచి తప్పించారు. ఆ స్థానంలో రాజేంద్ర ప్రసాద్ బాబును గుమాస్తాగా బదిలీ చేశారు. ఇక ఇంజినీరింగ్ విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పెద్దక్కను పెన్షన్ విభాగానికి బదిలీ చేశారు.
పెన్షన్ విభాగంలోని జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న బిఎస్. కష్ణమూర్తిని రాజేంద్ర మున్సిపల్ హైస్కూల్‌కు బదిలీ చేశారు. అక్కడ స్కూల్లో ఉన్న వసుంధరదేవిని రెవెన్యూ విభాగానికి మార్చారు. రెవెన్యూ విభాగంలో సీనియర్ అసిస్టెంట్ బికె. కుళ్లాయప్పను ఇంజినీరింగ్ విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా బదిలీ చేశారు. జూనియర్ అసిస్టెంట్ వి. సాయిశరత్ కుమార్‌ను రెవెన్యూ విభాగంలో ఏవన్ గుమస్తాగా నియమించారు. ఏవన్ గుమస్తా సీటు సీనియర్ అసిస్టెంట్ క్యాడర్ కలిగి ఉండగా, ఈ సీటుకు మేయర్ దగ్గర పిఎగా పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ సాయిశరత్ కుమార్‌ను బదిలీ చేయటంపై పలు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.
మున్సిపల్ స్కూల్లో సీనియర్ అసిస్టెంట్‌గా పలువురు గుమస్తాలు పనిచేస్తున్నా, వారి పేర్లను బదిలీలలో కనీసం పరిగణలోకి కూడా తీసుకోలేదు.
రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌గా పనిచేయటానికి మినిస్టీరియల్ గుమస్తాలు పలువురు యువకులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఎప్పటిలాగే రెవెన్యూ విభాగంలో సర్ధుబాటు ధోరణి తప్ప ఇతరులకు అవకాశం కల్పించలేదు. ఒకే సీట్లు ఏళ్ల తరబడి పని చేసుకుంటూ పోతే ఇతర విభాగాల పని ఎప్పుడు తెలుసుకునేదని కార్పొరేషన్ యువ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదంతా ఉన్నతాధికారులకు తెలియక కాదని కేవలం తమ అడుగులకు మడుగులొత్తుతూ వారి పనులన్నీ చక్కబెట్టే వారికి బదిలీల్లో ప్రాధాన్యతను ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. రెవెన్యూ విభాగం తరచూ అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడానికి ఇలాంటి మినహాయింపులే కారణం అవుతున్నాయి.
గతంలో రెండేళ్ల క్రితం బదిలీలు అయిన వారిన మళ్లీ ఇప్పుడు ఉన్నతాధికారులు తెచ్చి పెట్టుకున్నారు. మున్సిపల్ కార్పొరేషన్‌లో కొంతమంది గుమాస్తాలు పని చేయకుండా తిరుగుతున్నా వారిపై చర్యలు ఉండని పరిస్థితి ఉందనే విమర్శలు బాహాటంగానే విన్నిస్తున్నాయి.
విధులను సక్రమంగా నిర్వహించే వారిని గుర్తించకుండా పైరవీల చేసే వారికే ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైరవీలు చేసే వారికి కోరుకున్న చోటికి బదిలీ చేస్తూ, తమకు అన్యాయం చేస్తున్నారని యువ ఉద్యోగులు చెబుతున్నారు