వయసుతో పాటు వచ్చే సమస్యల్లో ప్రధానమైనవి ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు. శరీరంలోని అధిక వేడి ఈ సమస్యకు ముఖ్య కారణమని అంటారు. ఆహార విధానంలో పలు మార్పులు చేసుకుంటే ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- పచ్చి బొప్పాయిలో పపెయిన్ అనే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ పదార్థం ఉంటుంది. అది కీళ్ల నొప్పి, కండరాలు పట్టేయడం వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. ఆర్థరైటిస్‌తో బాధపడే వాళ్లు పచ్చి బొప్పాయిని తరచూ తీసుకోవాలి. పరగడుపున బొప్పాయి పండు తిన్నా ఉపశమనం లభిస్తుంది.
- తెల్ల నువ్వుల్లోని క్యాల్షియం, కాపర్ కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. తెల్ల నువ్వులు అధిక క్యాల్షియాన్ని అందిస్తాయి.
- మునగలోని క్యాల్షియం, ఫాస్పరస్ ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అలాగే, మునగలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఆర్థరైటిస్ చికిత్సలో తోడ్పడుతాయి.
- ఎండిన అంజీరాలో ఫైటోకెమికల్స్, పాలీఫెనాల్స్, ఫ్లెవనాయిడ్స్ ఉంటాయి. ఇవి ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి, కొత్త సమస్య రాకుండా చేస్తాయి. నేరుగా ఎండిన అంజీరా కాకుండా, వాటిని నానబెట్టి తింటే ఆరోగ్యానికి ఇంకా మంచిది.
- చియా గింజలల్లో ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులను నియంత్రిస్తాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో బాధపడేవారు ఈ గింజలను రోజూ నీళ్లలో నానబెట్టుకుని తాగాలి.
- మెంతుల్లోని లినోలెనిక్, లినోలిక్ ఆమ్లాలు కీళ్లనొప్పిని తగ్గిస్తాయి. ఒక టీస్పూన్ మెంతులను కప్పు నీళ్లలో బాగా మరిగించి, ఆ తర్వాత వడగట్టి తాగితే గుణం కనిపిస్తుంది.