సమాజం ఆధునికత దిశగా పరుగులు పెడుతున్నా, మనుషుల మధ్య అసమానతలు మాత్రం తొలగడం లేదు. ముఖ్యంగా తక్కువ సామాజిక తరగతికి చెందిన వారికి ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా ఓ గిరిజన బాలుడిని అనుమానంతో ఓ వ్యక్తి స్తంభానికి కట్టేశాడు. ఎర్రటి ఎండలో ఆ బాలుడు ఇబ్బందులు పడుతుండగా, అతడిని కొట్టి హింసించారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఏపీలోని తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలోని కడివేడులో సభ్యసమాజం తలదించుకునే ఘటన జరిగింది. కోడి దొంగతనం చేశాడనే అనుమానంతో సమీపంలోని తోట యజమాని ఓ గిరిజన బాలుడిని నిర్బంధించాడు. మేకలు తోలుకుపోతున్న ఆ బాలుడు తనకేమీ తెలియదని బదులిచ్చాడు. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన ఆ తోట యజమాని సదరు బాలుడిని స్తంభానికి కట్టేశాడు. అటుగా వచ్చిన కొందరు ఆ బాలుడిని విడిచి పెట్టాలని సూచించినా అతడు వినలేదు. ఆ నోటా ఈ నోటా విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు అక్కడకు చేరుకున్నారు. వారు కూడా తమ కుమారుడిని వదిలేయాలని వేడుకున్నారు. చివరికి కాళ్లావేళ్లా పడి తమ కుమారుడిని విడిపించుకున్నారు. అనంతరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.