బాధితురాలికి భరోసా ఇవ్వడానికి వచ్చిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ను బెదిరిస్తారా..? అత్యాచార బాధితురాలి గదిలో కేకలు వేస్తారా..? మహిళా కమిషన్ చైర్ పర్సన్‌తో ప్రవర్తించే తీరు ఇదేనా అని వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ఆమె మీడియా తో మాట్లాడుతూ... చంద్రబాబు హయాంలో మహిళా కమిషన్ అంటే తూతూమంత్రంగా నడిపారు. ఇప్పుడు మహిళా కమిషన్ డమ్మీ కాదు.. మహిళా కమిషన్ అత్యంత శక్తివంతమైనది. ఈ నెల 27 ఉ.11 గంటలకు మంగళగిరిలోని రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయానికి చంద్రబాబు, బొండా ఉమా స్వయంగా వచ్చి సమాధానం చెప్పాలి. మహిళా కమిషన్‌పై బోండా ఉమా ఆరోపణలు చేస్తున్నాడు. మహిళా కమిషన్ సుప్రీమా? అని అడుగుతున్నాడు అవును, కమిషన్ నీలాంటి ఆకు రౌడీలకు సుప్రీమే. మహిళలని వేధించే వారికి కమిషన్ సుప్రీమే. ఇలాంటి నేరాలు ఎవరూ చేసిన క్షమించేది లేదు.
బాధితురాలితో ఎలా వ్యవహరించాలో చంద్రబాబుకు తెలియదని నిన్ననే అర్దమైంది. యుద్దానికి వెళ్తున్నట్టు పెద్ద సంఖ్యలో వచ్చారు. మనసు, శరీరం గాయం అయిన యువతితో ఎలా వ్యవహరించాలో తెలుసుకోవాలి. అత్యాచార బాధితురాలితో ఎలా మాట్లాడాలో తెలియదా?. అలాంటి వారికి సమన్లు ఇచ్చే అధికారం మహిళా కమిషన్‌కు ఉంది. గతంలో చాలా కేసుల్లో పోలీసు అధికారులకు కూడా ఇచ్చాం. వారానికి యాభై, అరవై సమన్లు ఇస్తున్నాం. కోట్లాది మంది మహిళలకు నేను బాధ్యురాలిని. నా హక్కులు నాకు ఉన్నాయి. నేను రాజకీయ నాయకురాలినైతే అప్పుడు వేరేగా ఉండేది అని తెలియచేసారు.