జమ్మూకాశ్మీర్‌లో నిత్యం బాంబు పేలుళ్లు, తుపాకీ కాల్చిన చప్పుళ్లు నిత్యం కనిపిస్తుంటాయి. ముష్కరులు-భద్రతా దళాల మధ్య అక్కడ నిత్యం పోరు సాగుతుంటుంది. అయితే ప్రధాని మోడీ పర్యటన కొన్ని గంటల్లో ఉందనగా పేలుడు జరగడంతో ఆందోళన నెలకొంది. ఆదివారం జమ్మూకాశ్మీర్‌లోని సాంబా జిల్లాలోని పల్లీ గ్రామంలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. అక్కడ బహిరంగ సభలో మోడీ ప్రసంగించనున్నారు. ఈ క్రమంలో అక్కడకు 12 కి.మీ. దూరంలో బాంబు పేలింది. జమ్ము జిల్లాలోని లాలియాన గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఈ పేలుడు సంభవించింది. దీంతో ఆ ప్రాంతానికి పోలీసులు హుటాహుటిన వెళ్లారు.
అది ఉగ్రదాడేమోనన్న అభిప్రాయాలు తొలుత వ్యక్తమయ్యాయి. కాదని పోలీసులు తేల్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 అధికరణ రద్దు తర్వాత ప్రధాని మోడీ అక్కడ పూర్తిస్థాయిలో పర్యటించడం ఇదే తొలిసారి. బనిహాల్-కాజీగుండ్ సొరంగ మార్గంతో పాటు రూ.20 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించనున్నారు. శుక్రవారం ఆ రాష్ట్రంలో ఇద్దరు ఉగ్రవాదులు కాల్పుల్లో మరణించారు. దీంతో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. తాజా పేలుడు వారిలో కలవరం పుట్టించింది.