ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే అంతా డబ్బు మయం.క్రికెట్ (Cricket)ను పక్కా బిజినెస్‌గా మార్చేసిన లీగ్ ఇది. ఈ ఆటపై భారతీయులకు ఉన్న మోజునే పెట్టుబడిగా చేసుకొని ప్రారంభమైన ఈ లీగ్.. ఇటు అభిమానులకు వినోదాన్ని పంచుతూనే, అటు క్రికెటర్లపై కోట్ల వర్షం కురిపిస్తోంది. ఎందరో క్రికెటర్లు ఈ క్యాష్ రీచ్ లీగ్ ద్వారా వెలుగులోకి వచ్చారు. ఐపీఎల్ అంటేనే స్వదేశీ - విదేశీ క్రికెటర్లు. రకరకాల దేశాల ఆటగాళ్లు ఒక జట్టుగా ఆడతారు. దీంతో, ఈ లీగ్ ద్వారా చాలా మంది వేరే దేశ ఆటగాళ్లు స్నేహితులుగా మారడం చూశాం. ముఖ్యంగా ఈ లిస్టులో మనకు అందరికీ గుర్తొచ్చే జంట ఏబీ డివిల్లియర్స్ విరాట్ కోహ్లీ. ఈ జంట ఐపీఎల్ లో మంచి స్నేహితులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ, ఆండ్రూ సైమండ్స్ పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా మారిందట. ఐపీఎల్ వల్లే తన స్నేహితుడు, తనకి దూరమయ్యాడని అంటున్నాడు ఆసీస్ మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్
ఆస్ట్రేలియా తరుపున 26 టెస్టులు, 198 వన్డేలు ఆడిన ఆండ్రూ సైమండ్స్... ఐపీఎల్‌లో డెక్కన్ ఛార్జెర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల తరుపున ఆడాడు. ఐపీఎల్ 2008 సీజన్‌లో డెక్కన్ ఛార్జర్స్, రూ.5.4 కోట్లు పెట్టి ఆండ్రై సైమండ్స్‌ని కొనుగోలు చేసింది. ఆరంగ్రేటం సీజన్‌లో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు ఆండ్రూ సైమండ్స్. కానీ, ఈ డబ్బే సైమండ్స్ జిగిరీ దోస్తికీ బ్రేకులు వేసిందట. ఈ విషయాన్ని స్వయంగా సైమండ్స్ యే వెల్లడించాడు.
2007 వన్డే వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆండ్రూ సైమండ్స్, ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్... మంచి స్నేహితులుగా ఉండేవాళ్లు. అయితే స్టార్ ప్లేయర్‌గా ఎదుగుతున్న సమయంలోనే సైమండ్స్ కెరీర్‌కి అర్ధాంతరంగా ముగింపు కార్డు పడింది.2008లో ఓ వన్డే మ్యాచ్‌కి ఆండ్రూ సైమండ్స్ తాగేసి మత్తులో వచ్చాడని మైకేల్ క్లార్క్ వ్యాఖ్యానించడం అప్పట్లో సంచలనం క్రియేట్ చేసింది. క్లార్క్ కెప్టెన్సీని తీవ్రంగా విమర్శించిన ఆండ్రూ సైమండ్స్... తాజాగా తమ మధ్య ఉన్న విబేధాలను బయటపెట్టాడు.
అయితే మైకేల్ క్లార్క్‌తో తన స్నేహం, శత్రుత్వంగా మారడానికి ఐపీఎల్ కారణమంటున్నాడు ఆండ్రూ సైమండ్స్. " మేం చాలా మంచి స్నేహితులం. మేం చాలా మ్యాచుల్లో కలిసి బ్యాటింగ్ చేసి, జట్టును గెలిపించాం కూడా. మా మధ్య మంచి బంధం ఏర్పడింది. అయితే ఐపీఎల్ మొదలైన తర్వాత నాకు భారీ ధర పలకడం చూసి మైకేల్ క్లార్క్ బాగా జెలసీ ఫీల్ అయ్యాడట. అందుకే నేనంటే అతనికి నచ్చేది కాదని మాథ్యూ హేడెన్ చెప్పాడు. డబ్బు మన జీవితంలో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. డబ్బు మంచిదే కానీ దాని వల్ల లోపలున్న విషం బయటపడుతుంది. దాని వల్లే మా బంధం చెడిపోయింది. అతనంటే నాకు గౌరవం ఉంది. అందుకే అన్ని విషయాలు బయటపెట్టలేకపోతున్నా. " అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు ఆండ్రూ సైమండ్స్. ప్రస్తుతం ఈ మాజీ ఆసీస్ ఆల్ రౌండర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయ్.