ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కొనుగోలు చేశారు. 44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్‌ను కొనుగోలు చేసేందుకు ఆయన ప్రతిపాదించారు. దానిని అంగీకరించినట్లు ట్విట్టర్ సోమవారం ప్రకటించింది. ప్రజలు స్వేచ్ఛాయుతంగా ట్విట్టర్‌లో తమ అభిప్రాయాలను వెల్లడించలేకపోతున్నారని ఎలాన్ మస్క్ ఇటీవల కాలంలో విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో 2 వారాల క్రితం ట్విట్టర్‌లో 9.2 శాతం వాటాను కొనుగోలు చేశారు. మరో యాప్‌ను ఎలాన్ మస్క్ తీసుకొస్తారని అంతా భావించారు. అయితే ట్విట్టర్‌నే కొనుగోలు చేయాలని తలంచి చివరికి ఆ పని కూడా మస్క్ చేసేశారు. దీంతో ఆయన గుప్పెట్లోకి ట్విట్టర్ వచ్చేసింది.
ట్విట్టర్ షేర్‌కు 54.2 డాలర్లు చొప్పున 46.5 బిలియన్ డాలర్లతో ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తానని ఆయన ప్రతిపాదన అందించారు. దానికి ట్విట్టర్ బోర్డు కూడా తమ సమ్మతి తెలిపింది. దీంతో ట్విట్టర్ మస్క్ వశం అయింది. దీనిపై ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ స్పందించారు. "ట్విట్టర్ ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేసే ఉద్దేశ్యం మరియు ఔచిత్యాన్ని కలిగి ఉంది" అని ట్వీట్ చేశారు. ట్విట్టర్‌తో మస్క్ ఒప్పందం ఈ ఏడాది చివరికి పూర్తి అవుతుంది. ట్విట్టర్ కొనుగోలుకు సంబంధించి బ్యాంకుల ద్వారా నిధులను మస్క్ సమకూర్చుకున్నట్లు 'వాల్ స్ట్రీట్ జర్నల్' తెలిపింది.