సాధారణంగా ఏదైనా గోడను పడగొటితే అందులో ఇటుకలు, సిమెంట్-ఇసుక మిశ్రమం బయటపడుతుంది. కొందరు మట్టి ఇటుకలు వాడితే మరికొందరు సిమెంట్ ఇటుకలు వాడుతుంటారు. అయితే ఓ ఇంట్లో సోదాలకు వెళ్లిన అధికారులు అవాక్కయ్యారు. గోడలో కట్టలు కట్టలుగా డబ్బు, వెండి ఇటుకలు బయటపడడంతో షాక్ తిన్నారు. చివరికి వాటిని ఇన్‌కం ట్యాక్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
ముంబయిలోని కల్బాదేవి ప్రాంతంలో చాముండా అనే వ్యాపారి ఇంటిపై జీఎస్‌టీ అధికారులు మంగళవారం దాడులు చేశారు. ఇటీవల ఆయన కంపెనీలకు సంబంధించి జీఎస్‌టీని ఎగవేశారనే ఆరోపణలపై తనిఖీలు నిర్వహించారు. ఆయన కార్యాలయంలోని గోడ, నేల అనుమానాస్పదంగా కనిపించాయి. వాటిని పగులగొట్టి చూడగా భారీగా డబ్బు, వెండి ఇటుకలు కనిపించాయి. దీంతో వారు వెంటనే ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చి కూలంకషంగా ఆఫీసు మొత్తం సోదాలు చేపట్టారు. ఈ తనిఖీలలో రూ.9.8 కోట్ల నగదు, రూ.13 లక్షల విలువైన 19 కేజీల వెండి ఇటుకలు లభ్యమయ్యాయి. వాటిని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక చాముండా వ్యాపార లావాదేవీలు మూడేళ్ల వ్యవధిలో రూ.23 లక్షల నుంచి రూ.1,764 కోట్లకు చేరుకున్నాయి. దీంతో అధికారులకు అనుమానం తలెత్తి సోదాలు నిర్వహించడంతో గుట్టు బయటపడింది.