వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి సీఎం వైఎస్ జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. పార్టీలో అదనపు బాధ్యతలను అప్పగిస్తూ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం వైసీపీ అనుబంధ విభాగాల బాధ్యతలను విజయసాయి రెడ్డి చూస్తున్నారు. ఇటీవల కాలంలో పార్టీలోని పదవుల కేటాయింపులో విజయసాయిరెడ్డిని పక్కనపెట్టారనే వార్తలు వినిపించాయి. వాటికి చెక్ పెడుతూ తాజా నిర్ణయం తీసుకున్నారు. విజయసాయిరెడ్డికి వైసీపీ రీజినల్ కో- ఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షుల సమన్వయ బాధ్యతలు అప్పగించారు.
అంతేకాకుండా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డికి పార్టీలో బాధ్యతలను అప్పగించారు. ఎమ్మెల్యేలు, మీడియా కో-ఆర్డినేషన్ సమన్వయ బాధ్యతలను సజ్జల చూసుకోనున్నారు. ఏప్రిల్ 19న జారీ చేసిన ఉత్తర్వుల్లో స్వల్ప మార్పులు చేస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరిట పార్టీ ప్రకటన విడుదలైంది. దీనిని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్వయంగా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీంతో విజయసాయిరెడ్డికి పార్టీలో ప్రమోషన్ లభించిందని వైసీపీ శ్రేణులు సంతోషంలో ఉన్నాయి.