కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని.. మనం అప్రమత్తం కావాల్సిన సమయం ఆసన్నమైందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశంలోకరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల సీఎంలతో బుధవారం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు, పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా రోజుల తర్వాత స్కూళ్లు తెరుచుకున్నాయని, అయితే మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్న సంగతిని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో పిల్లల వ్యాక్సినేషన్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. వ్యాక్సిన్ అర్హత ఉన్న పిల్లలందరికీ సాధ్యమైనంత త్వరగా టీకాలు వేయాలని, వారి టీకా కవరేజీకి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. దీని కోసం స్కూళ్లలో ప్రత్యేక టీకా శిబిరాలు నిర్వహించాలన్నారు. టీచర్లతోపాటు తల్లిదండ్రులకు దీని గురించి సమాచారం ఇవ్వాలన్నారు.
ఇతర దేశాలతో పోలిస్తే కరోనాను దేశంలో మెరుగ్గా అదుపు చేశామన్నారు. అయితే ఇప్పుడు మనం అప్రమత్తం కావాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. దేశంలో దాదాపు 96 శాతం మంది వయోజనులు వ్యాక్సిన్ వేసుకున్నారని, ఇది గర్వించదగ్గ విషయం అన్నారు.
అలాగే పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం గతేడాది నవంబర్ నెలలో ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినా.. కొన్ని రాష్ట్రాలు చమురుపై వ్యాట్‌ను తగ్గించలేదన్నారు. అలా చేయడం ద్వారా తాము అందించిన ప్రయోజనాలు క్షేతస్థాయిలోని ప్రజల వరకు వెళ్లడం లేదన్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా ఎగుమతులు, దిగుమతులపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం అవసరం అన్నారు.