రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్రవర్ణాల్లోని పేదలకు సైతం ఏటా రూ. 15 వేలు అందిస్తున్నామన్నారు. పేదల పిల్లలు చదువుకు దూరం కాకూడదని అమ్మ ఒడి పథకం కింద రూ. 15 వేలు అందిస్తున్నామని, ఉన్నత విద్యకు తోడుగా ఉండేందుకు విద్యాదీవెన, వసతి దీవెన పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు.
పేద, మధ్య తరగతి ప్రజల బతుకులు బాగుపడాలన్న లక్ష్యంతో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే రాష్ట్రం దివాళా తీస్తోందని దుష్ప్రచారం చేయడం ఏంటని ప్రశ్నించారు. దమ్ముంటే తాము అధికారంలోకి వచ్చాక ఈ పథకాలను రద్దు చేస్తామని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా? అని ప్రశ్నించారు. మీ అందరి సంక్షేమం కోసం పాటు పడే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలో. లేక కేవలం అధికారాన్ని అనుభవించాలన్న కాంక్షతో ఉన్న చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ కావాలో ప్రజలు ఆలోచించాలని కోరారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మహిళాభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే అనంత తెలిపారు. ఇన్నాళ్లూ మహిళలకు శక్తి ఉన్నా, కష్టపడే తత్వం ఉన్నా కుటుంబాలకే పరిమితమైన పరిస్థితులు ఉండేవన్నారు. జగన్ సీఎం అయ్యాక పరిస్థితిలో మార్పులు వచ్చినట్లు చెప్పారు. ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా ముందుండి నడిపిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు హయాంలో మహిళా సంఘాలు రుణాలు చెల్లించలేకపోవడంతో డీఫాల్ట్ అయిన సందర్భాలు ఉన్నాయన్నారు. 2014 ఎన్నికల్లో రుణమాఫీ చేస్తానని టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడి హామీ ఇచ్చిన విషయం నిజమా కాదా అని ప్రశ్నించారు. తీరా అధికారంలోకి వచ్చాక ఎందుకు ఆ హామీని అమలు చేయలేదని ప్రశ్నించారు.
మహిళా సంఘాల సభ్యులు అలాగే ఉండిపోకుండా వ్యాపారవేత్తలుగా ఎదగాలని ఎమ్మెల్యే అనంత ఆకాంక్షించారు. వైఎస్ జగన్ సీఎం కాకముందు సంఘాలకు రూ. 10 లక్షల రుణం మాత్రమే ఇచ్చేవారని, కానీ నేడు రూ. 20 లక్షల వరకు అందిస్తున్నట్లు చెప్పారు. కుటీర పరిశ్రమలు నెలకొల్పి నలుగురికి ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేయాలని, అందుకు ప్రభుత్వం తోడుగా ఉంటుందన్నారు. నగరంలో కొత్తగా వచ్చిన సంఘాలకు రుణాలు అందించే విషయంలో ఉన్న సమస్యలను తొలగిస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్లుగా ఉన్న వారు అభివృద్ధి పట్టించుకోలేదని, కానీ ఇప్పుడు కరపత్రాలు చేతపట్టుకుని మీ ఇళ్ల వద్దకు వస్తున్నారన్నారు. మంచి చేసే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వారికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
చంద్రబాబులా తాము మోసం చేయలేదని, అధికారంలోకి వస్తే ఏం చేస్తామో ముందే చెప్పి వాటిని నెరవేరుస్తున్నామని ఎమ్మెల్యే అనంత తెలిపారు. అనంతపురం నగరంలో ఎన్నడూ లేని విధంగా రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం చేస్తున్నామన్నారు. పరిపాలనా వికేంద్రీకరణ, సౌలభ్యం కోసం సచివాలయ వ్యవస్థను తెచ్చి ఇంటి ముంగిటకే సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు చెప్పారు.
నగరంలో రూ. 600 కోట్లతో రోడ్డు పనులు జరుగుతున్నాయన్నారు. మురికివాడలు, శివారు ప్రాంతాల్లోనూ రానున్న మూడు నెలల్లో అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. తమపై నమ్మకంతో నగర పాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లకు గాను 48 డివిజన్లలో వైసీపీని గెలిపించారని, నమ్మకాన్ని వమ్ముచేయకుండా కార్పొరేటర్లు పని చేస్తున్నారన్నారు. అందరూ చేయిచేయి కలిపి నగరాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్దామన్నారు. నగరంలో 80 వేల కుటుంబాలున్నాయని, అందరూ కలిసి సుందర అనంతను తయారు చేద్దామన్నారు.