కేరళలోని కోజికోడ్ జిల్లాలో 'షిగెల్లా' ఇన్ఫెక్షన్ కేసు వెలుగు చూసింది. ఏప్రిల్ 20న ఏడేళ్ల బాలికకు అంటువ్యాధి షిగెల్లా బాక్టీరియా సోకినట్లు అధికారులు గుర్తించారు. ఆమె పొరుగున ఉన్న మరో చిన్నారికి కూడా లక్షణాలు కనిపించాయి. ఈ షిగెల్లా బ్యాక్టీరియా షిగెలోసిస్ అనే పేగు వ్యాధికి కారణమవుతుంది.
అతిసారంతో పాటు, కడుపు నొప్పి, జ్వరం, వాంతులు వికారం వంటివి ఈ వ్యాధి లక్షణాలు. కలుషితమైన ఆహారం తినడం వల్ల లేదా బ్యాక్టీరియా సోకిన నీటి వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ఇది ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుంది. ఇప్పటికే కరోనా ఆ రాష్ట్రంలో కల్లోలం రేపుతోంది. అధిక సంఖ్యలో కరోనా కేసులు, మరణాలు అక్కడ నమోదవుతున్నాయి. ఈ తరుణంలో షిగెల్లా బ్యాక్టీరియా వెలుగు చూడడం కలవరం రేపుతోంది.
బాధిత చిన్నారులను తాళ్లకుళత్తూరులోని పీహెచ్సీ కేంద్రానికి తల్లిదండ్రులు తరలించారు. పిల్లలిద్దరికీ పెద్దగా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. నివారణ చర్యగా ఆ ప్రాంతంలోని 100 ఇళ్లలోని బావులను అధికారులు క్లోరినేషన్ చేశారు. జ్వరం, డయేరియా వంటి లక్షణాలున్న వారిపై వైద్యారోగ్యశాఖ సర్వే కూడా నిర్వహించింది.