ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఢిల్లీ పర్యటనకువెళ్తున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీ బయలుదేరి, రాత్రికి అక్కడే బసచేస్తారు. శనివారం జరగనున్న జ్యుడీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో సీఎం జగన్ పాల్గొంటారు.వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో సీఎం జగన్ సమావేశం అవుతారు. ప్రధాని మోదీ సహా పలువురు కేంద్రమంత్రుల్ని కూడా కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మూడు వారాల క్రితం సీఎం జగన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సమయంలో ప్రధాని మోదీతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. నెల రోజుల సమయంలోనే ప్రధాని మోదీతో మరోసారి సమావేశం కానుండటంతో ఈ పర్యటన ఆసక్తి కరంగా మారింది.ఈ సారి ప్రధానితో భేటీలో ప్రధానంగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు,పోలవరం, కేంద్రం నుంచి సహకారంపై చర్చించనున్నట్లు సమాచారం.
అదే విధంగా రాష్ట్రపతి ఎన్నిక.. తాజాగా పెట్రో ఉత్పత్తుల పైన వ్యాట్ తగ్గింపు అంశం పైనా నేరుగా ప్రధానితో చర్చించే అవకాశం ఉంది. ఈ నెల 30వ తేదీన జరిగే జ్యుడిషీయల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో సీఎం జగన్ పాల్గొంటారు. ఈ సదస్సుకు ప్రధాని మోదీ, సీజేఐ ఎన్వీ రమణతో సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు హాజరుకానున్నారు.
దేశంలో న్యాయ, మౌలిక సదుపాయాల కల్పన, కేసుల సత్వర పరిష్కారంపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చ జరగనుంది. ఈ సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాల పైన ఇప్పటికే ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి – సీఎం జగన్ సమావేశమయ్యారు. జాతీయ సదస్సులో ప్రస్తావించాల్సిన అంశాల పైన చర్చించారు.