రేషన్ సరుకుల్లో కోతలేదని, అన్ని చోట్లా బియ్యం, కందిపప్పు లబ్ధిదారుల ఇంటి వద్దకే సరఫరా చేస్తున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో 76.81 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయగా, అందుకోసం రూ.12,377 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, అదే వైయస్ జగన్ ప్రభుత్వం కేవలం రెండేళ్ల 10 నెలల్లో 81.68 లక్షల టన్నుల బియ్యాన్ని పంపిణీ చేసిందని, ఇందుకోసం రూ.12,379 కోట్లు ఖర్చు చేసిందని లెక్కలతో సహా వివరించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పౌర సరఫరాల శాఖలో వినూత్న మార్పులు చేసిన సీఎం వైయస్ జగన్, ప్రతి విషయంలోనూ శ్రద్ధ తీసుకున్నారు. నాణ్యమైన (సార్టెక్స్) బియ్యం సరఫరా చేయడంతో పాటు, రేషన్ సరుకులను కూడా ఇంటి వద్దనే అందిస్తున్నారు. ఇంత చేస్తున్నా, ఎల్లో మీడియా రోజూ ఏదో ఒక విధంగా ప్రభుత్వంపై బురద చల్లుతోంది. తాడేపల్లిలోని వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు.