సాధారణంగా ఓ 30 ఏళ్లున్న వ్యక్తి అంటే ప్రస్తుత కాలంలో పెళ్లికి సిద్ధం అవుతుంటాడు. ఉద్యోగంలోనో, వ్యాపారంలోనో స్థిరపడి, తగిన జోడీ కోసం వెతుకుతూ ఉంటారు. ఒక వేళ్ల అప్పటికే పెళ్లైతే ఒకరో ఇద్దరో పిల్లలను కలిగి ఉంటాడు. అయితే అమెరికాకు చెందిన ఓ వ్యక్తి ఇప్పటికే 47 మందికి తండ్రి అయ్యాడు. అంతే కాదండోయ్.. మరో 10 మందికి త్వరలో తండ్రి అవనున్నాడు. ఇతడి గురించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన యువకుడు కైల్ గార్డీ (30) వీర్య దాత. ఇలా ఇప్పటికే 47 మంది పిల్లలకు బయోలాజికల్ ఫాదర్ అయ్యాడు. వీర్యదాత ఉండడం వల్ల తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతున్నాడు. అయితే ఈ పని వల్ల తన వ్యక్తిగత జీవితంలో తాను ప్రేయసిని వెతుక్కునేందుకు తగిన సమయం కేటాయించలేకపోతున్నానని బాధపడుతున్నాడు. తనకు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు చాలా మంది మహిళల నుంచి మెసేజ్‌లు వస్తున్నాయన్నారు. అవన్నీ వీర్య దానం గురించే కావడంతో కొంత నిరుత్సాహానికి గురవుతున్నానన్నారు. చాలా మంది మహిళలు తనతో డేటింగ్ చేసేందుకు ఆసక్తి చూపడం లేదని, కొందరు ఓకే చెప్పినా తమ బంధం ముందుకు సాగడం లేదని చెప్పాడు. ఎవరైనా మంచి మహిళ తనకు జీవిత భాగస్వామిగా వస్తుందనే ఆశతో ఉన్నట్లు పేర్కొన్నాడు. ఇతడి వ్యాఖ్యలపై నెటిజన్లు సోషల్ మీడియాలో ఫన్నీగా స్పందిస్తున్నారు.