దేశవ్యాప్తంగా కరోనా కేసులు క్రమేపీ పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా రోజువారీ కరోనా కేసుల నమోదు విషయంలో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 3,324 కరోనా కేసులు వెలుగు చూసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాలు తెలుపుతున్నాయి. మహమ్మారి బారిన పడి గత 24 గంటల్లో 40 మంది మరణించారు. 2,876 మంది వైరస్ బారిన పడి, చికిత్స పొంది కోలుకున్నారు. మరోవైపు దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 19 వేల మార్కును దాటింది. ప్రస్తుతం 19,092 యాక్టివ్ కేసులు ఉన్నాయి. శనివారం దేశవ్యాప్తంగా 3,688 కోవిడ్ కేసులు నమోదవగా, 2,755 రికవరీ అయ్యారు. 50 మంది మరణించారు. వీటితో పోలిస్తే ఆదివారం స్పల్పంగా కేసులు, మరణాలు తగ్గాయి. ఇక కోవిడ్‌కు కట్టడి చేసేందుకు ప్రారంభించిన వ్యాక్సినేషన్ ఇప్పటి వరకు 189 కోట్లను దాటింది. శనివారం 26 లక్షల మందికి వ్యాక్సిన్ డోస్ అందించారు. టీకాలు వేసిన మొత్తం లబ్ధిదారులలో 2.82 కోట్లకు పైగా బూస్టర్ డోస్ టీకా పొందారు. ఈ కారణంగా కొన్ని రాష్ట్రాలలో కేసులు తక్కువగా నమోదవుతున్నాయి.