వేసవి వచ్చిందంటే చాలు ఇళ్లలో మజ్జిగ అనో, నిమ్మరసం అనో ఏదో ఒకటి పిల్లలకు ఇస్తుంటారు. పెద్దలు కూడా చాలా ఇష్టంగా వాటిని తాగుతుంటారు. వీటితో పాటు సబ్జా గింజలను కూడా విరివిగా వాడుతుంటారు. నానబెట్టిన సబ్జా గింజలు జెల్లీల మాదిరి ఉండడంతో పిల్లలు కూడా ఇష్టంగా వీటిని కలిపిన ద్రావణాలను తాగుతుంటారు. వేసవిలో వీటితో కూడిన ద్రవాణాలను తాగితే ఎన్నో ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శరీరంలోని కొవ్వును కరిగించడంలో సబ్జా గింజలు దోహపడతాయి. ఇందులో పుష్కలంగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ జీవక్రియను మెరుగ్గా ఉంచుతాయి. అన్నిటికంటే ముఖ్యంగా శరీరంలో వేడికి తగ్గించడంలో సబ్జా గింజలకు సాటి ఏదీ లేదు. నిమ్మరసం, ఫలూదా పేరుతో పలు డ్రింక్‌లలో వీటిని కలిపి ఇస్తుంటారు.
మధుమేహ వ్యాధిగ్రస్తులకు సబ్జా గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా టైప్-2 మధుమేహ బాధితులకు చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో ఇవి దోహదపడతాయి. శరీరంలో పేరుకుపోయిన మలినాలను సబ్జా గింజలు బయటకు పంపుతాయి. అంతేకాకుండా కడుపులో మంటను దూరం చేసి, జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. రోగనిరోధక శక్తిని ఇవి గణనీయంగా మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా కొబ్బరినూనెలో సబ్జా గింజల పొడిని కలిపి శరీరంపై రాసుకుంటే చర్మవ్యాధులు దరి చేరవు.