మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలో గోవధకు పాల్పడ్డారనే అనుమానంతో సంపత్, ధన్సా అనే ఇద్దరు గిరిజనులను కొందరు మంగళవారం ప్రశ్నించారు. ఈ తరుణంలో ఆగ్రహం పట్టలేక వారిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఆ ఇద్దరు గిరిజనులే గోవధకు పాల్పడ్డారని అనుమానించి చావబాదారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వారి దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ గిరిజనులిద్దరూ హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచారు. మరో యువకుడు బ్రజేష్ తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న ఏఎస్పీ ఎస్‌కే మారావి అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. 20 మందిని ఈ గొడవలకు కారకులుగా గుర్తించి వారిపై కేసు పెట్టారు. మరో ఆరుగురిపై హత్యాయత్నం అభియోగాలు మోపారు. కాగా ఈ అంశంపై మాజీ ముఖ్యమంత్రి కమలనాథ్ స్పందించారు. అల్లరిమూకలను కఠినంగా శిక్షించాలని, బాధితులకు ప్రభుత్వం నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు.