శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే శుక్రవారం తమ దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఐదు వారాల వ్యవధిలోనే రెండవసారి ఎమర్జెన్సీని ఆయన విధించారు. తన రాజీనామాను డిమాండ్ చేస్తూ జరిగిన దేశవ్యాప్త సమ్మె కారణంగా ఆయన తాజా నిర్ణయం తీసుకున్నారు. జనజీవనం సాధారణ స్థితికి తీసుకురావడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్షుడి తరుపు ప్రతినిధి తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున, రాజపక్సే రాజీనామాను డిమాండ్ చేస్తూ జాతీయ పార్లమెంటును ముట్టడించేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ ఫిరంగిని ప్రయోగించారు. జుడీషియల్ పర్యవేక్షణ లేకుండానే అనుమానితులను చాలా కాలం పాటు అరెస్టు చేయడానికి, నిర్బంధించడానికి ఎమర్జెన్సీ భద్రతా బలగాలకు విస్తృత అధికారాలను ప్రభుత్వం ఇచ్చింది.
తాజాగా ప్రకటించిన ఎమర్జెన్సీ శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుందని అధ్యక్షుడు గోటబయ రాజపక్సే చెప్పారు. ఏప్రిల్ 1న తొలిసారి ఎమర్జెన్సీని ఆయన ప్రకటించారు. ఆ నిర్ణయాన్ని ఏప్రిల్ 14న రద్దు చేశారు. ఆ తర్వాత మరోసారి ఉద్రిక్తతలు తలెత్తడంతో తాజాగా మరోసారి ఎమర్జెన్సీని అమలు చేయనున్నారు. ఇదిలా ఉండగా శ్రీలంకలో పరిస్థితులు విషమిస్తున్నాయి. ప్రజలు చిన్న చిన్న గుంపులుగా మారి, అధికార పార్టీ నాయకులపై దాడులకు పాల్పడుతున్నారు. దీంతో శ్రీలంక ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజాప్రతినిధులందరికీ భద్రత కల్పించేందుకు 85 వేల మంది పోలీసులను నియమించారు.