క్యూబా దేశపు రాజధాని హవానాలో శుక్రవారం తెల్లవారు జామున బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఓ హోటల్‌లో జరిగిన పేలుడుతో 18 మంది మృతి చెందగా, 64 మంది గాయపపడ్డారు. శిథిలాలలో చిక్కుకున్న వారి కోసం పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు గాలిస్తున్నారు. దీనిపై క్యూబా అధ్యక్ష కార్యాలయం స్పందించింది. హోటల్ సరటోగాలో పేలుడు సంభవించడానికి గ్యాస్ లీకేజీ కారణమని భావిస్తున్నట్లు పేర్కొంది. ప్రమాదవశాత్తు పేలుడు సంభవించిందని అని అంచనా వేస్తున్నట్లు వివరించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం మరణించిన వారిలో ఒక చిన్నారి, గర్భిణి కూడా ఉన్నారు. 14 మంది మైనర్లతో సహా 64 మంది గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు.
ఇది బాంబు లేదా దాడి కాదని, దురదృష్టకర రీతిలో ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. సమీపంలోని పాఠశాలను ఖాళీ చేయించామని, పిల్లలకు ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ప్రముఖ పర్యాటక కేంద్రమైన సరటోగా హోటల్ రెండేళ్ల పాటు మూసి వేసినట్లు ఆ హోటల్ నిర్వాహకులు వెల్లడించారు. దానిని తిరిగి మే 10న తెరిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఈ ఐదు అంతస్థుల భవనం పాత హవానా పరిసరాల్లో ఉంది. దీనిని 1930లలో హోటల్‌గా తీర్చిదిద్దారు. ఇది క్యూబా నేషనల్ క్యాపిటల్ భవనానికి ఎదురుగా ఉంది.