ఏదైనా సరస్సులో, లేదా జలాశయంలో చేపలు కొట్టుకు రావడం విని ఉంటాం. లేకుంటే శంఖాలు, గువ్వలు వంటివి ఒడ్డుకు రావడం చూసి ఉంటాం. అయితే ఓ సరస్సులో మాత్రం కట్టలు కట్టలుగా డబ్బులు కొట్టుకొచ్చాయి. అందులోనూ ఎక్కువ రూ.2 వేల నోట్ల కట్టలే కనిపించాయి. వాటిని చూసిన స్థానికులంతా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. చివరికి పోలీసులు అక్కడకు చేరుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
రాజస్థాన్ రాష్ట్రం అజ్మీర్‌లోని అనాసాగర్ సరస్సులో శుక్రవారం స్థానికులు అవాక్కయ్యారు. సరస్సులో కట్టకట్టలుగా నోట్ల కట్టలు కనిపించడంతో వాటిని స్వాధీనం చేసుకుందామనుకున్నారు. కొందరు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో విషయం తెలుసుకున్న అనాసాగర్ ఎస్పీ బల్‌దేవ్‌సింగ్ భారీ ఎత్తున సిబ్బందితో సహా అక్కడకు చేరుకున్నారు. అక్కడ లభించినవన్నీ రూ.2 వేల నోట్ల కట్టలేనని ఆయన మీడియాకు చెప్పారు. తడిసి పోవడంతో వాటిని లెక్కించడం కుదరలేదన్నారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వాటిని విసరేయడం స్థానికులు చూశారని వెల్లడించారు. అవి నకిలీ నోట్లు అని కొందరు కొట్టి పారేశారు. అయితే ఆ నోట్లపై ఆర్‌బీఐ ముద్ర ఉందని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. 2021 జూన్‌లోనూ ఇలాంటి తరహా ఘటనే జరిగింది. సరస్సులో అప్పుడు కూడా కొందరు నోట్ల కట్టలు విసిరేశారు. వాటిని దక్కించుకునేందుకు చాలా మంది ప్రాణాలకు తెగించి, సరస్సులోకి దూకేశారు.