ఏపీలో టీడీపీ, జనసేన పార్టీలో అనైతిక కలయికలో ఉన్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆ రెండు పార్టీలో ఉమ్మడిగా రానున్న ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని తెలుస్తోందని మంగళవారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. అయితే ఉమ్మడి సీఎం అభ్యర్థిగా ఎవరిని ఎన్నుకుంటారనేదే ప్రశ్న అని అన్నారు. గతంలో మాదిరే చంద్రబాబును సీఎంగా ప్రకటిస్తారా లేక కొత్తగా పవన్ కళ్యాణ్‌ను ప్రకటిస్తారా అని ప్రశ్నించారు. ఇద్దరికిద్దరూ తామే సీఎం అభ్యర్థులమని ప్రకటించుకున్నారని గుర్తు చేశారు. 2014లో బీజేపీతో పాటు ఆ రెండు పార్టీలు ఉమ్మడిగా పోటీ చేశాయన్నారు. 2019లో విడిపోయినట్లు నటించాయని విమర్శించారు. 2024లో వారు ఉమ్మడిగా పోటీ చేయడంపై తమకేమీ ఆశ్చర్యం లేదని అన్నారు.
ఎన్నికలకు ఇంకా రెండేళ్ల వ్యవధి ఉందని, అప్పుడే పొత్తులపై తొందరెందుకని టీడీపీ, జనసేనలను సజ్జల ప్రశ్నించారు. చంద్రబాబు డైరెక్షన్‌లో పవన్ రైతు భరోసా యాత్రలు చేపడుతున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమని టీడీపీ, జనసేన ప్రకటించాయని, వారు అవసరమైతే కేఏ పాల్ పార్టీతోనూ పొత్తు పెట్టుకుంటారని వ్యంగ్యంగా అన్నారు. రానున్న ఎన్నికల్లోనూ టీడీపీ, జనసేనకు పరాభవం తప్పదని స్పష్టం చేశారు.