ఉన్నత హోదాలో ఉంటూ మానవత్వం ప్రదర్శించడం చాలా అరుదుగా చూస్తుంటాం. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్ డీఎల్) సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా ముంబయిలో ఓ కార్యక్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ డీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ పద్మజ చుండూరు ప్రసంగిస్తుండగా, మధ్యలో దాహం వేసింది. దాంతో నీళ్లు కావాలంటూ సిబ్బందికి సైగ చేశారు. సిబ్బంది నీళ్లు తేవడంలో కొంచెం ఆలస్యం అయింది.
అయితే, వేదికపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఉన్నారు. ఎన్ఎస్ డీఎల్ ఎండీ పద్మజ దాహంతో ఇబ్బందిపడడాన్ని గుర్తించిన నిర్మలా... వెంటనే స్పందించారు. స్వయంగా తానే నీళ్లు తీసుకువెళ్లి ఆ మహిళా ఉన్నతాధికారికి అందించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కేంద్రమంత్రి అయ్యుండి, ఎంతో మానవీయ కోణంలో స్పందించిన తీరు పట్ల నిర్మలా సీతారామన్ ను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.