ఇటీవల కాలంలో వివాహాలు, ఇతర శుభకార్యాలలో డీజే పెట్టడం ఆచారంగా మారిపోయింది. డీజే సాంగ్స్ పెట్టడం, వాటికి అనుగుణంగా కుర్రాళ్లు చిందులు వేయడం మనం చూస్తుంటాం. ఇక పెళ్లిలో డీజే పాటలు పెడుతూ, సంతోషంగా ఉన్న వ్యక్తికి ఊహించని ప్రమాదం ఎదురైంది. పెళ్లి కొడుకు స్వయంగా అక్కడికి వచ్చి, డీజే పాటలు పెట్టే వ్యక్తిని తుపాకీతో కాల్చేశాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
యూపీలోని ముజఫర్‌పూర్ ప్రాంతం సమీపంలోని షాపూర్‌లో సోమవారం ఓ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. వరుడు ఇఫ్తికార్ కూడా పెళ్లికి వచ్చిన అతిథులతో కలిసి డీజే సాంగ్స్‌కు ఉత్సాహంగా డ్యాన్సులు వేశాడు. అయితే డీజే పెట్టిన ఓ పాట వరుడు ఇఫ్తికార్‌కు నచ్చలేదు. డీజే పాటలు పెట్టిన వధువు తరుపు బంధువు జాఫర్ అలీతో గొడవ పడ్డాడు. వారి మధ్య వాగ్వాదం చిలికి చిలికి గాలివానలా తయారైంది. దీంతో ఆగ్రహం పట్టలేని వరుడు ఇఫ్తికార్ తన వద్ద ఉన్న తుపాకీ బయటకు తీశాడు. అందరూ చూస్తుండగానే జాఫర్ అలీపై తుపాకీతో కాల్చాడు. ఈ ఘటనలో అక్కడే కుప్పకూలిన జాఫర్ అలీ బంధువులు హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే అతడు చనిపోయాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.