ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్ల మోటు సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారి ప్రక్కన ఉన్న నర్సరీలపై కొద్దిగా రోజుల క్రితం ఓ విద్యుత్ వైరు తెగి నర్సరీల పై పడిన సంఘటన చోటు చేసుకుంది. పలుమార్లు రైతులు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అయినా అధికారులు స్పందించకపోగా అది న్యూట్రల్ వైరు ఏమి కాదు అని చెప్పి నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించారు.
ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆ వైరు నుంచి స్వల్పంగా విద్యుత్తు ప్రవహిస్తూ ఉంది. నర్సరీలకు ఉన్న ఇనుప కంచెను తాకితే షాక్ కొడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసిన సిబ్బంది కొరత ఉందని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి తేగి పడిపోయిన విద్యుత్ వైర్ ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.