కొన్ని కేసులు నిజంగా మనం సినిమాలో చూసినట్లే కనిపిస్తాయి. అలాంటి ఘటనయే ఇటీవల మధ్యప్రదేశ్ లో చోటు చేసుకొంది. యజమాని సొత్తుతో పరారై చనిపోయినట్టు నమ్మించిన వ్యక్తిని 10 నెలల తర్వాత పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. నిందితుడు చనిపోయాడని భావించిన అతడి కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే.. డీఎన్ఏ నివేదిక పరీక్షల్లో సరిపోలకపోవడంతో కేసును పోలీసులు కొనసాగించారు. పోలీసుల కథనం ప్రకారం.. పికప్ ట్రక్ డ్రైవర్ అయిన సునీల్ నామ్దేవ్ (38) తనను మోసం చేసి, డబ్బులు కాజేశాడని ఆరోపిస్తూ గతేడాది జులై 16న సుధీర్ అగర్వాల్ అనే వ్యాపారి బమితా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
తాను పంపిన ఐరన్ లోడును రాజ్నగర్లో దింపి, అక్కడి కస్టమర్ నుంచి రూ.6.65 లక్షలు తీసుకుని పరారయ్యాడని ఆరోపించారు. అయితే, కొద్దిరోజుల తర్వాత నిందితుడి వాహనం ఓ గొడౌన్ వద్ద గుర్తించారు. జులై 24న బమితా పోలీస్ స్టేషన్ పరిధిలోని కోడాహర్ ప్రాంతంలో గుర్తుతెలియని మృతదేహం లభించడంతో అది సునీల్‌గా భావించారు. అతడి కుటుంబసభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కానీ.. మృతదేహం శాంపిళ్లు సేకరించి డీఎన్ఏ పరీక్షలకు పంపారు. సునీల్ కుటుంబసభ్యుల డీఎన్ఏతో సరిపోలకపోవడంతో కేసు దర్యాప్తు కొనసాగించారు.
గతవారం బాధితుడు సుధీర్ అగర్వాల్.. బాగేశ్వర్ ధామ్ అలయానికి వెళ్తుండగా.. గధా టిగడ్డ అనే ప్రాంతంలో సునీల్ తారసపడ్డాడు. తన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని సుధీర్ అడిగితే ఎదురుదాడికి దిగాడు. ఇప్పటికే తాను పోలీసు రికార్డుల్లో చనిపోయానని, తన జోలికి వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించాడు. తనకు తిరిగి రూ. 5లక్షలు ఇవ్వాలని లేకుంటే చంపుతానని కూడా హెచ్చరించారు. దీంతో సునీల్‌ను తాను చూసిన విషయం బాధితుడు పోలీసులకు చెప్పడంతో రంగంలోకి దిగారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి రెండు రోజుల కిందట సునీల్ను అరెస్టు చేశారు.
అతడి దగ్గర ఉన్న రూ.5లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సునీల్ డబ్బులతో పరారైన తర్వాత పోలీసుల కంటబడకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తిరిగాడని ఛతర్‌పూర్ ఎస్పీ సచిన్ శర్మ తెలిపారు. అంతేకాదు, గత 10 నెలల నుంచి కుటుంబసభ్యులతో టచ్‌లో లేడని, ఇటీవలే ఛతర్‌పూర్‌కి వచ్చాడని తెలిపారు. ఇక, సునీల్‌ది భావించి అంత్యక్రియలు నిర్వహించిన మృతదేహం ఎవరిదని పోలీసులు గుర్తించే పనిలో ఉన్నారు.