కృష్ణాజిల్లాలోని వాణిజ్య పంటల రైతుల్ని అసని తుపాన్ కుంగతీసింది. తుపాన్ ప్రభావంతో వీచిన ఈదురు గాలులు, భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వాణిజ్య పంటలు దెబ్బతిన్నాయి. వేల ఎకరాల్లో పంట దెబ్బతినటంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. కళ్ల ఎదుట నేలకొరిగిన పంటను చూసి రైతులు కన్నీరు పెడుతున్నారు. జిల్లాలో మొత్తం 790. 70 హెక్టార్లలో వివిధ రకాల వాణిజ్య పంటలు దెబ్బతినగా రూ. 1. 91 కోట్ల మేర నష్టం వాటిల్లింది. అలాగే 731. 1 హెక్టార్ల అరటి పంట దెబ్బతింది. అరటి పంట నష్టం 1. 82 కోట్లుగా అధికారులు ప్రాథమిక అంచనాలు రూపొందించారు. కూరగాయల పంటల విషయానికి వస్తే 45 హెక్టార్లలో పంటలు దెబ్బతినగా రూ. 06. 75లక్షల మేర నష్టం వాటిల్లింది. 13. 80 హెక్టార్లలో బొప్పాయి పంట దెబ్బతినగా రూ. 2. 07లక్షల మేర నష్టం వాటిల్లిందని సంబంధిత శాఖాధికారులు తెలుపుతున్నారు.