శ్రీలంక ప్రజలు ఇంకా శాంతించడంలేదు. రోడ్డెక్కిన నిరసనకారులు తమ ఆగ్రహాన్ని అణుచుకోవడంలేదు. దీంతో శ్రీలంక ఆర్థిక, రాజకీయ సంక్షోభం చివరకు హింసాత్మకంగా మారింది. ప్రజాగ్రహానికి తలొగ్గి ప్రధాని పదవికి మహీంద రాజపక్స రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామా చేసినా జనం వదలిపెట్టడం లేదు. హంబన్‌టోటలోని రాజపక్స పూర్వీకుల నివాసానికి నిరసనకారులు నిప్పుంటించి, అక్కడి రాజపక్స మ్యూజియంను ధ్వంసం చేశారు. మహీంద కేబినెట్‌లో ఉన్న పలువురు మంత్రుల నివాసాలను ఆందోళనకారులు తగలబెట్టారు. తాజాగా, ఆందోళనకారులకు భయపడి రాజపక్స కుటుంబం నౌకా స్థావరంలో తలదాచుకుంటోంది. మహింద రాజపక్స, ఆయన కుటుంబసభ్యులను హెలికాప్టర్‌లో ఈశాన్య ప్రావిన్సుల్లోని ట్రింకోమలి నావెల్ బేస్‌కు తరలించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
అయితే, నావెల్ బేస్‌ను ఆందోళనకారులు వదలిపెట్టలేదని, దాని ఎదుట నిరసనలు తెలుపుతున్నారని పేర్కొన్నాయి. సోమవారం సాయంత్రం నుంచి చెలరేగిన హింసాత్మక ఘటనల్లో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఇప్పటి వరకూ ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లు ప్రయోగించాల్సి వచ్చింది. ఈ ఘటనల్లో 200 మందికిపైగా గాయపడ్డారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తేవడానికి శ్రీలంక వ్యాప్తంగా మంగళవారం నుంచి కర్ఫ్యూ విధించారు.
వేలాది మంది ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు సోమవారం రాత్రి కొలంబోలోని మహింద రాజపక్స అధికారిక నివాసంపై దూసుకొచ్చారు. గుంపును చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించింది. దీంతో ప్రధాని అధికారిక నివాసమైన టెంపుల్ ట్రీస్ ముందు ఉద్రిక్త ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆందోళనకారులు ప్రధాని ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. పరిస్థితి విషమించడంతో ముందస్తు ఆపరేషన్‌లో భాగంగా రాజపక్స కుటుంబాన్ని సురక్షిత ప్రాంతానికి సైన్యం తరలించింది.
ఆందోళనకారులు కనీసం 10 పెట్రోల్ బాంబులను కాంపౌండ్‌లోకి విసిరినట్టు భద్రతా అధికారిని ఉటంకిస్తూ ఏఎఫ్‌పీ వార్తా సంస్థ నివేదించింది. గత ఏడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనివిధంగా శ్రీలంక తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీనికంతటికీ రాజపక్స కుటుంబమే కారణమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమాన్ని అణచివేయడానికి అధ్యక్షుడు గోటాబయా రాజపక్స ఎమర్జెన్సీ విధించి.. సైన్యానికి విశేష అధికారాలను కట్టబెట్టారు.
మరోవైపు, హింసకు కారణమైన మాజీ ప్రధాని మహీందను అరెస్టు చేయాలని ప్రతిపక్ష నాయకులు పెద్ద ఎత్తున డిమాండ్లు చేస్తున్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తోన్న నిరసనకారులపైన ప్రభుత్వం దాడులు చేయించిందని.. ఫలితంగానే ఈ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు.