చాలా మంది ఆర్థిక పరిస్థితి బాలేక, కుటుంబంలో ఎవరూ చదివించే స్థోమత లేక చదువును కొనసాగించేకపోతున్నారు. ఏదో చిన్నాచితకా పనులు చేసుకుంటూ జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. కానీ ఇక్కడో అమ్మాయి మాత్రం అలా ఆలోచించలేదు. తాను పూలమ్మీ చదువుకుంది. పీహెచ్డీ చేయడానికి సిద్దమైంది. పిహెచ్‌డి చేయడం కోసం ఏకంగా యునైట్‌డ్ స్టేట్స్ కాలిఫోర్నియా యూనివర్శిటీకి వెళ్లడానికి సిద్దమైంది. ఆమె పేరు సరిత మాలీ(28). ముంబయి మురికివాడల్లో పెరిగిన సరిత లోకల్ ట్రైన్‌లో వెళ్లి సంతలో పూలు కొనేది. ఆ తర్వాత ఆ పూలను మాలలుగా కట్టి వీధుల్లో అమ్మేది. తండ్రి తెచ్చిన పూలను కట్టి చిన్నప్పటి నుంచి అమ్ముతూ వచ్చింది. 5వ తరగతిలో నాన్నకు సాయంగా ఆమె పూలను అమ్మడం మొదలు పెట్టింది.
మున్సిపల్ స్కూల్‌లో 10వ తరగతి వరకు చదివిన సరిత కాలేజీ ఫీజుల కోసం తండ్రి మీద ఆధారపడకుండా ఇంటిదగ్గర ట్యూషన్లు చెబుతూ ఆ తరువాత గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. ఆ తర్వాత ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలో ప్రవేశం పొంది ఎంఎ హిందీ లిటరేచర్ పూర్తిచేసింది. ఆమె మొదట్లో పూలను అమ్మి రోజుకు గరిష్టంగా రూ.300 సంపాదించి తన తండ్రికి ఇచ్చేది. తనకు ఎన్ని కష్టాలు వచ్చినా చదువును మాత్రం కొనసాగించానని, ఆ విధంగానే ఇప్పుడు పీహెచ్డీ చేయడానికి కాలిఫోర్నియా ఆహ్వానం అందుకున్నట్లు సరిత చెప్పుకొచ్చింది. ఈనాటి రోజుల్లో బాధలో కూరుకుపోయిన చాలా మందికి సరిత జీవితం ఆదర్శం.