పార్టీకి పూర్వ వైభవం తేవడమే లక్ష్యంగా శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు కాంగ్రెస్ నవసంకల్ప్ చింతన్ శిబిర్ మేథోమధన సదస్సు జరగబోతోంది.రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ వేదికగా జరుగుతున్న ఈ సమావేశాలకు ముందే కాంగ్రెస్ ప్రక్షాళన ప్రారంభించింది. పార్టీకి వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న వారిని ఉపేక్షించబోయేది లేదని ఇటీవల రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అది ఎంత పెద్ద వారైనా సరే, ఎంతటి సీనియర్లైనా సరే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చింతన్ శిబిరానికి ముందు రోజే కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన షురూ చేసేసింది. పార్టీకి వ్యతిరేకంగా అసమ్మతి రాగం వినిపిస్తున్న కేంద్ర మాజీ మంత్రి కె.వి. థామస్ ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ మేరకు ఏఐసీసీ అనుమతితో కేరళ పీసీసీ అధ్యక్షుడు కె.సుధాకరన్ నిర్ణయం తీసుకున్నారు. కె.వి థామస్ కాంగ్రెస్ పార్టీ నియమాలను ఉల్లఘిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా కొచ్చిలో జరిగిన ఉప ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో కలిసి ఒకే వేదికపై థామలస్ పాల్గొన్న కొన్ని గంటల్లోనే పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడాన్ని బట్టి చూస్తే అసమ్మతి నేతల విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఎంత సీరియస్ గా ఉందో స్పష్టం అవుతోంది.
ఇదిలా ఉంటే రాజస్థాన్ లో జరగబోయే చింతన్ శిబిర్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పార్టీలో ఉన్న లోటుపాట్లను విశ్లేషించుకుని ముందుకు వెళ్లే మార్గాలపై చర్చించి వ్యూహరచన చేసుకోబోతున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ రైలు మార్గంలో శుక్రవారం బయలుదేరారు. రొహిల్లా రైల్వే స్టేషన్ లో చేతిలో బ్యాగ్ పట్టకుని సామాన్య ప్రయాణికుడిలా ఆయన దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా రైతు కూలీలతో రాహుల్ గాంధీ మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సామాన్యులకు చేరువ అవ్వడంలో భాగంగా ఆయన రైలు మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇక రాజస్థాన్ సమావేశాలు రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలను రెట్టింపు చేస్తాయని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి.