ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం కంప్యూటర్‌లో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో వైయస్ఆర్ రైతు భరోసా పథకం కింద నాలుగో ఏడాది మొదటి విడత డబ్బు జమ చేశారు. వైయస్ఆర్ రైతు భరోసా కింద 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అర్హత పొందిన 50,10,275 రైతు కుటుంబాలకు తొలి విడతగా రూ.3,758 కోట్ల పెట్టుబడి సాయం అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.... మీ బిడ్డ వైయస్ జగన్ మోహన్ రెడ్డిని నిజాయితీ, నిబద్ధత ఉందని, ఏది చెబితే అదే చేస్తానని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రశ్నించాల్సిన సమయంలో చంద్రబాబును దత్తపుత్రుడు, ఈనాడు, ఏబీఎన్, టీవీ5 ఎందుకు ప్రశ్నించలేదని సీఎం వైయస్ జగన్ మండిపడ్డారు. గత ప్రభుత్వం, మన ప్రభుత్వం మధ్య తేడాను ప్రజలు గమనించాలి. రైతు భరోసా పథకం గతంలో ఉండేదా?. మూడేళ్లలో అర కోటికిపైగా రైతులకు రైతు భరోసా పథకం ద్వారా రూ.23,875 కోట్లు నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేశాం. రాష్ట్ర చరిత్రలో ఇంత సహాయపడిన ప్రభుత్వాన్ని ఏనాడైనా చూశారా?. రైతన్నలకు ప్రతి అడుగులోనూ తోడుగా ఉంటున్నాం. ఉచిత పంటల బీమా ద్వారా 31 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. చంద్రబాబు హయాంలో రైతులను మోసం చేస్తే దుష్ట చతుష్టయం ప్రశ్నించలేదు. రైతుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు ఉందా? అని నిలదీశారు. ఎక్కడా లంచాలు లేవు. వివక్ష లేదు. ఓటు వేసినా వేయకపోయినా మంచి చేసే పని జరుగుతోంది. కేంద్రం ప్రకటించని పంటలకు కూడా మద్దతు ధర కల్పించి కొనుగోలు చేస్తున్నాం. గతానికి, ఇప్పటికి ఉన్న తేడాను రైతులు గమనించాలని సీఎం వైయస్ జగన్ విజ్ఞప్తి చేశారు.