ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. జూన్ 10న పోలింగ్ నిర్వహించి, అదే రోజున ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఏపీ నుంచి విజయసాయిరెడ్డి, టీజీ వెంకటేష్, సుజనా చౌదరి, సురేష్ ప్రభుల పదవీ కాలం పూర్తైంది. మే 24న ఈ స్థానాలకు ఎన్నిక నిమిత్తం నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు తుది గడువు మే 31గా నిర్ణయించారు. ఏపీలో ఖాళీ అయిన నాలుగు స్థానాల్లో ఒక ఎంపీ స్థానాన్ని తిరిగి విజయసాయిరెడ్డికి వైసీపీ కేటాయించనుంది.
అసెంబ్లీలో పూర్తి ఆధిక్యం ఉండడంతో మిగిలిన మూడు స్థానాలు కూడా వైసీపీకే దక్కుతాయి. మైనార్టీ కోటాలో సినీ కమెడియన్ ఆలీ, బీసీ కోటాలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, బీద మస్తాన్ రావు పేర్లు వినపడుతున్నాయి. కొత్తగా బీసీ ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్య పేరు జాబితాలో కూడా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌ను కలుసుకునేందుకు ఆయన మంగళవారం ఉదయం తాడేపల్లికి వచ్చారు. దీంతో ఆర్.కృష్ణయ్యను సీఎం జగన్ రాజ్యసభకు పంపనున్నారనే వార్తలకు బలం చేకూరుతుంది. అయితే దీనిపై ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు.