చాలా మంది జీవితంలో ఏదో కోల్పోయామని భావిస్తుంటారు. చిన్న సమస్యకే అంతా తల్లక్రిందులైందని కుమిలి పోతుంటారు. ఇంకొందరు ఏకంగా ఆత్మహత్యలకు యత్నిస్తారు. అయితే తనకు రెండు చేతులు లేకున్నా ఓ మహిళ ఎందరికో స్పూర్తిదాయకంగా నిలుస్తోంది. తనకు ఉన్న వైకల్యాన్ని ఎప్పుడూ అవరోధంగా భావించలేదు. స్వయంగా ఇంటి పనులు చేసుకుంటూ, పిల్లల్ని పెంచుతూ ఔరా అనిపిస్తోంది. ఆ స్ఫూర్తిదాయక మహిళ గురించి తెలుసుకుందాం.
బెల్జియం దేశానికి చెందిన సారాటాల్బి రెండు చేతులు లేకుండానే పుట్టింది. వ్యక్తిగత పనులు చేసుుకనేందుకు కూడా ఆమెకు చాలా ఇబ్బందిగా ఉండేది. అయినప్పటికీ తనకున్న రెండు కాళ్లనే ఎన్నో పనులకు అనుగుణంగా మలుచుకుంది. తన రెండు కాళ్లతో రోజువారీ పనులు చేసుకుంటూనే, ఎన్నో అందమైన చిత్రాలను గీస్తోంది. ఈమె గీచిన చిత్రాలను ప్రతిష్టాత్మక బ్రస్సెల్స్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో ప్రదర్శించారు. అవి చూసిన ఎంతో మంది ప్రముఖులు సారా ప్రతిభను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ఆమెకు వివాహమైంది. ఓ పాప కూడా పుట్టింది. ఈమె జీవితం గురించి తెలుసుకున్న కొందరు వీడియోలు చేయమని ప్రోత్సహించారు. అలా కొన్ని వీడియోలు చేసి, తనకు ఎదురైన కష్టాలను చెబుతూనే వాటిని ఎదుర్కొనే తీరును అందులో వివరించింది. ఆమె పెట్టిన యూట్యూబ్ ఛానెల్‌కు 2.7 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఆమె పెట్టిన వీడియోలను కోట్లలో ప్రజలు వీక్షిస్తుంటారు. ఆమె జీవితం నుంచి ఎంతో మంది స్పూర్తి పొందామని చెబుతుంటే ఆమె ఎంతో సంతోషిస్తోంది. ఇలా ఎందరికో జీవిత పాఠాలు చెబుతూ, కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలనే సందేశాన్ని ఇస్తోంది.