కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. కిలో టమాట కేరళలో రూ.100, ఒడిశాలో రూ.90, కర్ణాటకలో రూ.70, ఏపీ, తెలంగాణల్లోనూ రూ.60 నుంచి 80కి పైగా చేరింది. తీవ్ర ఎండలకు వేడిగాలులు తోడవడంతో టమాటా ఉత్పత్తి బాగా పడిపోయింది. టమాటా ఉత్పత్తిలో ముందున్న ఏపీ, ఒడిశాల్లో అసని తుఫాన్‌తో పంట బాగా దెబ్బ తింది. ఈ ప్రభావంతో ఒక్కసారిగా ధరలు అమాంతం పెరిగిపోయాయి. కిలో టమాట రూ.20కి తీసుకున్న ప్రజలు ప్రస్తుతం పెరిగిన రేటు చూసి షాకవుతున్నారు. కిలో పచ్చి మిర్చి రూ.40, కాకరకాయ కిలో రూ.45, ఫ్రెంచ్ బీన్ కిలో రూ.145గా ఉంది.
మరో వైపు బ్రాండెడ్ ఆయిల్ లీటర్ రూ.192, పామాయిల్ రూ.142 గా ఉంది. కిలో అల్లం రూ.60, వెల్లుల్లి కిలో రూ.160, ఆవాలు కిలో రూ.140, కిలో పచ్చడి కారం రూ.480గా ఉంది. మరో వైపు చికెన్ ధరలు ఆకాశాన్నంటాయి. కిలో చికెన్ రూ.280కి పైగా ఉంది. కిలో మటన్ రూ.700గా ఉంది. ఓ వైపు పెట్రోల్,డీజిల్, గ్యాస్ ధరలు పెరగడం, ఇప్పుడు కూరగాయల ధరలు పెరగడంతో వంటింట్లోకి అడుగుపెట్టాలంటేనే అంతా జంకుతున్నారు. మరో వైపు పండ్ల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. రూ.100కి 3 సేపులు మరియు 3 దానిమ్మ పండ్లు రాని పరిస్థితి నెలకొంది.