పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని మధ్యప్రదేశ్ కు చెందిన అంకిత నాగర్ అనే యువతి నిరూపించింది. ఆమె తల్లిదండ్రులు అదే ప్రాంతంలో తోపుడు బండిలో కూరగాయలు అమ్ముతుంటారు. కూరగాయలు అమ్మితే కానీ పూట గడవని కుటుంబంలో జన్మించిన ఆమె ఇప్పుడు సివిల్ జడ్జిగా ఎంపికైంది.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లా ముసఖేది అనే ప్రాంతానికి చెందిన అంకిత (29) ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా స్కాలర్‌షిప్ లతో ఎల్ఎల్‌ఎమ్, ఎల్‌ఎల్‌బి పూర్తి చేసింది. ఎల్‌ఎల్‌బి చదువుతూనే జడ్జి పరీక్షకు ప్రిపేర్ అవ్వడం ప్రారంభించింది. రోజూ 8 నుంచి 10 గంటల వరకు చదివేది. ఈ క్రమంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. ఒకానొక సమయంలో పరీక్షకు అప్లై చేయడానికి ఆమె దగ్గర సరిపడ డబ్బులు లేవు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల రీత్యా ఆమె తల్లిదండ్రులకు సహాయంగా కూరగాయలూ కూడా అమ్మింది.
కరోనా లాక్‌డౌన్‌లో యూట్యూబ్ ద్వారానే తాను ఎక్కువగా చదువుకున్నానని, ప్రభుత్వం ఇచ్చే స్కాలర్‌షిప్‌లు ఆర్థికంగా ఉపయోగపడ్డాయని అంకిత చెప్పుకొచ్చింది. ఎన్నో సవాళ్లను అధిగమించి కష్టపడి చదివిన అంకిత నాలుగో ప్రయత్నంలో విజయం సాధించింది. ఇటీవలే విడుదలైన సివిల్ జడ్జి క్లాస్-2 ఫలితాల్లో ఎస్సీ విభాగంలో ఐదవ ర్యాంకును సాధించి సివిల్ జడ్జిగా ఎంపికైంది.