ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఈ విషయంపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నకిలీ ఖాతాల అంశంలపై ట్విట్టర్‌కు, ఎలాన్ మస్క్‌కు విభేదాలు తలెత్తాయి. ట్విట్టర్‌లో నకిలీ ఖాతాల సంఖ్య 20 శాతం వరకు ఉండొచ్చని ఇటీవల బహిరంగంగా మస్క్ వ్యాఖ్యానించారు. ఓ ట్విట్టర్ యూజర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆ విషయం చెప్పారు. ఇది నిబంధనలకు విరుద్ధమని ట్విట్టర్ లీగల్ సెల్ నుంచి మస్క్‌కు నోటీసు వెళ్లింది. అంతేకాకుండా ట్విట్టర్ డీల్ రద్దు చేసుకుంటే ఒక బిలియన్ డాలర్ల నష్ట పరిహారం చెల్లించాలని తెలిపింది.
ఆ నోటీసులపై మస్క్‌లో ఆగ్రహం పెల్లుబికి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్‌లో నకిలీ ఖాతాల పని తేల్చేంత వరకు డీల్ జరగదని స్పష్టం చేశారు. నకిలీ ఖాతాలు 5 శాతం లోపే ఉంటాయని రుజువు చేయాలని సూచించారు. అయితే నిత్యం ట్విట్టర్ నకిలీ ఖాతాలు పుట్టుకొస్తుంటాయని, వాటిని చాలా వరకు తాము నియంత్రిస్తున్నట్లు ట్విట్టర్ సీఓవో పరాగ్ అగర్వాల్ వెల్లడించారు. అయితే ట్విట్టర్‌లో నకిలీ ఖాతాలు 5 శాతంలోపే ఉంటాయని తెలపడంతో తాను 44 బిలియన్ డాలర్లు చెల్లించేందుకు ఆసక్తి చూపానని మస్క్ పేర్కొంటున్నాడు. అయితే నకిలీ ఖాతాలను చూపించి, ట్విట్టర్‌ను తక్కువకే స్వాధీనం చేసుకునేందుకు ఎలాన్ మస్క్ పన్నిన ఎత్తుగడగా కొందరు అభివర్ణిస్తున్నారు.