దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కొన్నాళ్లుగా రోజువారీ కరోనా కేసులు మూడు వేలకు పైగా నమోదవుతూ వచ్చాయి. దీంతో మన దేశంలో కోవిడ్ ఫోర్త్ వేవ్‌కు ఇవి సంకేతాలనే అభిప్రాయాలు వచ్చాయి. అయితే తాజాగా కేసులు తగ్గుతుండడం శుభపరిణామమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో గత 24 గంటల వ్యవధిలో 1,829 కోవిడ్ కేసులు వెలుగు చూశాయి. వీటితో కలిపి దేశంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 4,31,27,199కి చేరింది. వీరిలో మొత్తం 4,25,87,259 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. తాజాగా 33 మంది కరోనా కారణంగా మృతి చెందారు. వీటితో కలిపి మొత్తం కరోనా మృతుల సంఖ్య 5,24,293కు చేరింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 15,647 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కరోనా కేసులు తగ్గుతున్న కారణంగా రోజువారి కోవిడ్ పాజిటివిటీ రేటు కూడా క్షీణిస్తోంది. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 0.42 శాతంగా ఉన్నదని కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడించాయి. మొత్తం కేసుల్లో 0.04 శాతం కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.75 శాతంగా ఉందని పేర్కొన్నాయి. మరణాలు 1.22 శాతంగా ఉన్నాయని వివరించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,91,65,00,770 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్రం వెల్లడించింది. మంగళవారం ఒక్కరోజే 14,97,695 మందికి వ్యాక్సినేషన్ చేశామని తెలిపింది.