చైనీయులకు వీసాలు అక్రమంగా అమ్ముకున్నారనే కేసులో కాంగ్రెస్ నేత కార్తీ పి చిదంబరం సన్నిహితుడిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) బుధవారం అరెస్టు చేసింది. చెన్నై, ఢిల్లీలోని చిదంబరం నివాసాలతో సహా దేశంలోని పలు నగరాల్లోని 10 ప్రాంతాల్లో సీబీఐ బృందాలు సమన్వయంతో సోదాలు నిర్వహించిన ఒక రోజు తర్వాత ఈ అరెస్టు జరిగింది. సీబీఐ వర్గాల సమాచారం ప్రకారం, వీసా అవినీతి కేసులో కాంగ్రెస్ నాయకుడు కార్తీ పి చిదంబరం సన్నిహితుడు ఎస్ భాస్కర్ రామన్‌ను మంగళవారం అర్థరాత్రి సీబీఐ ప్రశ్నించింది. రూ.50 లక్షలు లంచంగా స్వీకరించి విద్యుత్ కంపెనీకి అని పేర్కొంటూ 263 మంది చైనా పౌరులకు వీసాలు కల్పించారనే ఆరోపణలపై ఎంపీ కార్తీ చిదంబరంపై సీబీఐ తాజాగా కేసు నమోదు చేసింది.
11 ఏళ్ల క్రితం ఆయన తండ్రి పి.చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉన్న సమయంలో ఇది జరిగిందని సీబీఐ తెలిపింది. అయితే సీబీఐ అరెస్టులపై కార్తీ చిదంబరం సెటైరికల్ ట్వీట్ పెట్టారు. "నాకు కౌంట్ పోయింది, ఎన్ని సార్లు అయ్యింది.. తప్పక రికార్డ్ అయి ఉండాలి" అని సీబీఐ దాడులు జరిగిన వెంటనే కార్తీ ట్వీట్ చేశాడు. తన కార్యాలయంలో 2015లో రెండుసార్లు, 2017లో ఒకసారి, 2018లో రెండుసార్లు, తాజాగా ఈరోజు రెండుసార్లు సీబీఐ తనిఖీలు చేసిందని ఆయన చెప్పారు.