దావోస్ సదస్సు జరిగే ప్రాంతంలో ఏపీ తరఫున పెవిలియన్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. దావోస్ సదస్సు ద్వారా ఏపీకి ఉన్న ప్రత్యేకతలు, ప్రాధాన్యతలు వివరించడం ద్వారా రాష్ట్రానికి మరింత మేలు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈనెల 22న ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి సదస్సులో ఏపీకి చెందిన ప్రతినిధులు హాజరవుతారని అన్నారు. 18 అంశాలపై దావోస్‌లో చర్చ జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం లాగా మేము లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని అబద్ధాలు చెప్పమన్నారు.
ఈ మేరకు విశాఖలో ఐటీ మంత్రి మీడియాతో మాట్లాడుతూ... దాదాపు 2000 మంది ప్రతినిధులు హాజరయ్యే ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వివిధ అంశాలను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. చంద్రబాబునాయుడు హయాంలో ఇలాంటి సదస్సులను బ్లాక్ మనీని వైట్ చేసుకోడానికి ఉపయోగించుకున్నారని ఆరోపించారు. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రాధాన్యతలు వివరించడం ద్వారా పెట్టుబడులు ఆకర్షించడానికి అవకాశం ఉండే సదస్సుగా మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అభివర్ణించారు.