వైసిపి ప్రభుత్వాన్ని నిలదీసేందుకే మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షుడలు నారా చంద్రబాబునాయుడు పర్యటనలు చేస్తున్నారని, అందులో భాగంగానే నేడు అనంతపురం జిల్లాకు వస్తున్నారని టిడిపి అనంతపురం జిల్లా అధ్యక్షులు కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ సందర్బంగా అనంతపురం నగరంలో తపోవనంలోని వివిఆర్ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్య పాలనపై టిడిపి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 20న ఉమ్మడి అనంతపురం జిల్లాలో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు టిడిపి అధినేత చంద్రబాబు వస్తున్నారని తెలిపారు. 19వ తేది రాత్రి అనంతపురం చేరుకుంటారని, 20వ తేది 10 గంటలకు వివిఆర్ కన్వెన్స్ ప్రాంగణంలో కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. మధ్యాహ్నం నుంచి రాప్తాడు, చెన్నేకొత్తపల్లి మీదుగా సోమందేపల్లి వెళ్లి టిడిపి ఆధ్వర్యంలో నిర్వహంచే బాదుడే బాదుడు కార్యక్రమానికి హాజరవుతున్నారని తెలిపారు.
అనంతరం టిడిపి జిల్లా ఇన్‌ఛార్జ్ బిటి నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో శ్రీలంకలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం తలెత్తే ప్రమాదం పొంచి ఉందన్నారు. అక్కడ ప్రధాని ఇంట్లో దాక్కొని ఉంటే ప్రజలు ఇంటినే తగుల పెట్టారని, ఆర్మీ సహాయంతో ప్రధాని బంకర్లలో దాక్కున్నారని తెలిపారు. రాష్ట్రంలో అదే పరిస్థితులు ఉత్పన్నమైతే ముఖ్యమంత్రి దాక్కోవడానికి బంకర్లు కూడా లేవని ఎద్దేవా చేశారు. ప్రజలు ఎంతో ఆశతో ఒక్క అవకాశం ఇస్తే వారి ఆశలు ఆవిరి అయ్యేలా పరిపాలించారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వం గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో కార్యక్రమం చేపట్టిందన్నారు. టిడిపి ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. అయితే ప్రభుత్వానికి, మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి తిరుగుబాటు ఎదురవుతుంటే, టిడిపి అధినేతకు ఘన స్వాగతాలతో ఆదరిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి భారీ పోలీసు భద్రత వలయాల నడుమ తాడేపల్లికే పరిమితం అయ్యారని, అందరిని దగా చేసిన ప్రభుత్వం పతనం ప్రారంభం అయిందన్నారు.
ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి, జిల్లా ప్రచార కార్యదర్శి వెంకటరాముడు, రాష్ట్ర నాయకులు ఆలం నరసానాయుడు, ఆదినారాయణ, దేవెళ్ల మురళి, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఎంఎస్. రాజు, మాజీ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గౌస్‌మొద్దీన్, సాకే గంపన్న, మహిళా అధ్యక్షురాలు స్వరూప, గాండ్ల విశాలాక్షి, శివబాల, జిల్లా అధికార ప్రతినిధి సరిపూటి రమణ, నారాయణస్వామి యాదవ్, డిష్. నాగరాజు, మారుతికుమార్ గౌడ్, వెంకటశివుడు యాదవ్, ముంటిమడుగు కేశవరెడ్డి, ఆదెన్న తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa