ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు రైతులను నిండా ముంచాయి. గత కొన్ని సంవత్సరాలుగా అకాల వర్షాలు రైతులను నష్టాల పాలు చేస్తున్నాయి. తీరా పంట చేతికి వచ్చే సమయానికి ఇలా అకాల వర్షాలు పంటలు తుడిచిపెట్టేస్తూ ఉండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
మరి ప్రతి సారి ఇలా పంటలు చేతికొచ్చే సమయానికి వరుణుడు రైతులను నట్టేట ముంచే చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత మూడు సంవత్సరాలుగా ఇదే పరిస్థితి నెలకొనడంతో రైతులు వ్యవసాయం చేసేందుకు ఆసక్తి కనబరచడం లేదు. గతంలో వేసిన శనగ, అరటి రైతులు కూడా ఈ విధంగానే నష్టపోయారు.
మొన్న అసని తుఫాను ప్రభావంతో మిర్చి, పత్తి, మామిడి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఇలా వాతావరణం రైతులపై పగ పట్టిన విధంగా వ్యవహరిస్తూ ఉండడం రైతులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఆహార ధాన్యాలకు లోటు ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పొల్యూషన్ పెరిగిపోవటం పర్యావరణాన్ని రక్షించడంలో ప్రజలు అలసత్వం ప్రదర్శించడమే ఈ పరిణామాలు చవి చూస్తున్నామని నిపుణులు అంటున్నారు.
అభివృద్ధి పేరుతో పెంచిన చెట్లను ఇష్టానుసారంగా నరికి వేయడం అటవీ ప్రాంతాలను ధ్వంసం చేయడం కూడా వాతావరణ మార్పులకు కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇలా పర్యావరణాన్ని రక్షించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు కాబట్టే అకాల వర్షాలు రైతులకు నష్టాన్ని కలిగిస్తున్నాయని పంటలు నష్టపోవడం వల్లే మనకు నిత్యావసరాల పై ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతూ సామాన్యులపై పెనుభారం పెరుగుతూ వస్తుందని అంటున్నారు.
ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరిచి పర్యావరణాన్ని రక్షించే విధంగా వ్యవహరించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెట్లను నరకడం మానేసి చెట్లను పెంచాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.