ఇటీవల కాలంలో శరీరానికి వ్యాయామం కరువవుతోంది. చాలా మందికి ఊబకాయం సమస్య వేధిస్తోంది. ఈ తరుణంలో చాలా మంది సన్నబడేందుకు ఆహారం మానేస్తుంటారు. ఇంకొందరు ఏ ఆహారం తినాలో, ఆరోగ్యకరంగా బరువు తగ్గేందుకు ఏం చేయాలో తెలియక సతమతం అవుతుంటారు. ఈ నేపథ్యంలో సన్నబడేందుకు కొన్ని సలహాలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అల్పాహారం మానివేయడం వల్ల బరువు తగ్గదు. మీరు అవసరమైన పోషకాలను కోల్పోవచ్చు. ఆకలితో ఉన్నందున రోజంతా ఎక్కువ అల్పాహారం తీసుకోవచ్చు. రోజులో నిర్ణీత సమయాల్లో తినడం వల్ల కేలరీలు వేగంగా ఖర్చవుతాయి. పండ్లు, కూరగాయలు తాజావి తింటూ ఉండాలి. వీటిలో కొవ్వు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటుంది. విటమిన్లు, మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి.
ఒకే చోట అదేపనిగా కూర్చుండి పోకుండా, మధ్యమధ్యలో అటూఇటూ తిరుగుతూ ఉండాలి. యాక్టివ్‌గా ఉంటే శరీరంలో అదనపు బరువు అధికంగా చేరదు. నీరు ఎక్కువగా త్రాగాలి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినండి. పండ్లు, కూరగాయలు, ఓట్స్, హోల్‌గ్రెయిన్ బ్రెడ్, బ్రౌన్ రైస్, పాస్తా, బీన్స్, బఠానీలు, కాయధాన్యాలు వంటి వాటిలో మాత్రమే ఫైబర్ లభిస్తుంది. చాక్లెట్, బిస్కెట్లు, స్వీట్లు, ఇతర జంక్ ఫుడ్‌ను అధికంగా తినడం ఆపాలి. బదులుగా పండ్లు, పండ్ల రసాలు, ఓట్ కేకులు వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను ఎంచుకోవాలి. మద్యం తాగడం తగ్గించాలి.