తెలంగాణలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పర్యటిస్తున్నారు. నల్గొండ జిల్లాలో మృతి చెందిన పార్టీ కార్యకర్త సైదులు కుటుంబాన్ని శుక్రవారం పరామర్శించారు. వారికి రూ.5 లక్షల సాయం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. తాను నటించిన 'తమ్ముడు' సినిమా బాగా హిట్ అయిందన్నారు. దీంతో చిత్ర యూనిట్ విజయోత్సవ సభ చేద్దామని చెప్పిందన్నారు. అయితే దానికి కేటాయించే డబ్బులను నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ కారణంగా బాధపడుతున్న గ్రామాల ప్రజలకు సాయంగా అందించాలని చెప్పానని గుర్తు చేసుకున్నారు. ఇందుకు చిత్ర బృందం అంగీకరించిందన్నారు.
ఆ సమయంలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకుందామని వస్తే, స్థానికంగా రాజకీయ నేతలు అడ్డు పడ్డారని వివరించారు. దీంతో ప్రజలకు మంచి చేయాలంటే ఖచ్చితంగా రాజకీయ అండ కావాల్సిందేననే విషయం అర్ధమైందన్నారు. అందుకే 2007 నుంచి రాజకీయాల్లో ఉంటున్నట్లు చెప్పారు. ఈ ఘటన తన మనసులో బలంగా నాటుకోవడంతో రాజకీయాల్లోకి రావాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. ఈ క్రమంలోనే తెలంగాణ గడ్డపైనే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.