నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ముందుగానే రానున్నాయి. ఏటా జూన్ 1న కేరళను నైరుతి పవనాలు తాకుతాయి. అయితే ఈ ఏడాది మే 25నే రుతు పవనాలు తాకనున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురవనున్నట్లు ఐఎండీ తెలిపింది. రుతుపవనాల ప్రభావంతో కర్నాటక, కేరళ రాష్ట్రాలలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రభావంతో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇక తెలంగాణలోనూ రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ క్రమంలో ఉత్తర దక్షిణ ద్రోణి ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ అంతర్గత కర్నాటక మీద కొనసాగుతోందని తెలిపింది. ఉపరితల ఆవర్తనం వరకు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నట్లు వెల్లడించింది. ఈ ప్రభావంతో హైదరాబాద్ నగరంతో సహా తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలలో వర్షాలు పెడతాయని పేర్కొంది.