శింగనమల నియోజకవర్గంలో నీటి సమస్యలను సులువుగా పరిష్కరించే అవకాశాలున్నాయని సాగునీటి సలహా మండలి సమావేశంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు.
అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్ లో జరిగిన సమావేశంలో పాల్గొన్న జిల్లా ఇంచార్జి, రాష్ట్ర ఇంధన, అటవీ, గనులు, పర్యావరణశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హెచ్ఎల్ సీ రిజర్వాయర్ నుంచి 10 టీఎంసీ నీరు అనంతపురం జిల్లా తీసుకోవడం వల్ల శింగనమల నియోజకవర్గానికి అన్యాయం జరుగుతోందని అన్నారు. అయితే 5 టీఎంసీ నీటిని మాత్రమే వారికి ఇవ్వగలిగితే, మిగిలిన 5 టీఎంసీ నీటితో మా నియోజకవర్గంలో సాగునీటి అవసరాలకు, చెరువులు నింపడానికి, తాగునీటికి ఉపయోగించవచ్చునని అన్నారు.
అలాగే 5వ డిస్ట్రిబ్యూటరీ స్లూయిస్ షిఫ్టింగ్ పనులు వేగవంతం చేయాలని కోరారు. దీనివల్ల చివరి భూముల రైతులకు మేలు జరుగుతుందని అన్నారు.
ఎస్ఈ ఆరు నెలల నుంచి సంవత్సరం లోపు పూర్తవుతుందని హామీ ఇచ్చారని తెలిపారు. శింగనమల చెరువు లోకలైజేషన్ గురించి ఇంఛార్జి మంత్రిగారికి మరొక్కసారి విన్నవిస్తున్నామని తెలిపారు.
ఉలికల్లు, ఉల్లికంటిపల్లి ఆర్&ఆర్ ప్యాకేజ్ నిధులు విడుదల చేయాల్సిందిగా విజ్నప్తి చేశారు. అనంతసాగర్ ట్యాంకు నుంచి సిద్ధరాంపురం చెరువుకి పైప్ లైను ద్వారా నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతసాగర్ ట్యాంక్ లో మురుగునీరు కలవకుండా చర్యలు తీసుకోవాలని వివరించారు.
శింగనమల నియోజకవర్గానికి హెచ్ఎల్సీ, పీఏబీఆర్, హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా అన్ని ట్యాంకులు నింపాలని కోరారు. ఆగస్టు 1కల్లా ఆయకట్టుకు నీరు విడుదల చేయాలని తెలిపారు. ఇలా శింగనమల నియోజకవర్గానికి సంబంధించిన నీటి సమస్యలను ఇంచార్జిమంత్రి సమక్షంలో వివరించారు.