పుతిన్ ఈ పేరు ఇపుడు పరిచయం అక్కర్లేనిది. ఉక్రెయిన్ పై దండయాత్ర చేస్తున్న నేపథ్యంలో రష్యా దేశాధినేత పుతిన్ పేరు ఇట్టే చెప్పేస్తున్నారు. ఇదిలావుంటే పుతిన్ కుమార్తె వ్యవహారం ఇటీవల వెలుగులోకి రావడంతో ఆ వార్త సంచలనంగా మారింది. వృత్తిరీత్యా డ్యాన్సర్ అయిన రష్యాదేశాధినేత పుతిన్ కుమార్తె కాటెరినా ఎవరికీ తెలియకుండా ఓ వ్యక్తితో సహజీవనం చేస్తోందని జర్మన్, రష్యాన్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతోంది. ఆ వ్యక్తి పేరును వెల్లడించిన జర్మన్ మ్యాగ్ జైన్ నివేదిక అది రష్యా అధ్యక్షుడికి నచ్చకపోవచ్చని వ్యాఖ్యానించింది. ఇగోర్ జెలెన్‌స్కీ అనే 52 ఏళ్ల వ్యక్తితో కాటెరినా సహజీవనం చేస్తోందని నివేదిక పేర్కొంది. ఇది పుతిన్ ప్రస్తుతం శత్రువుగా పరిగణిస్తున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీకి సమానమైన ఇంటి పేరు కావడం గమనార్హం.
ఉక్రెయిన్‌పై దండయాత్ర మొదలైనప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యక్తిగత జీవితం, ఆయన కుటుంబం గురించి అనేక కథనాలు, నివేదికలు వెలువడుతున్నాయి. ఆయన కుమార్తె కాటెరినా టిఖోనోవా రిలేషన్‌షిప్ గురించి అంతర్జాతీయ మీడియాలో ప్రచారం సాగుతోంది. జెలెన్‌స్కీతో ఆమె రహస్యంగా రిలేషన్‌షిప్‌లో ఉందని, జర్మనీలో విలాసవంతమైన జీవితం గడుపుతోందని ఓ నివేదిక చక్కర్లు కొడుతోంది. పుతిన్ కుమార్తెలలో ఒకరు రహస్యంగా జర్మనీలో విలాసవంతంగా గడుపుతున్నట్టు ప్రముఖ జర్మన్ మ్యాగజైన్ డెర్ స్పీగెల్, రష్యన్ ప్రయివేట్ మీడియా ఐస్టోరీస్ సంయుక్త పరిశోధనలో బయటపడింది.
పరిశోధనాత్మక నివేదిక ప్రకారం ఇగోర్ జెలెన్‌స్కీ ప్రొఫెషనల్ బ్యాలెట్ డ్యాన్స్, మ్యూనిచ్ అధికారిక బ్యాలెట్ విభాగం మాజీ డైరెక్టర్ కూడా. అంతేకాదు, కాటెరినాకు రెండేళ్ల కుమార్తె ఉందని, ఆమె బిడ్డకు ఇగోర్ తండ్రని విశ్వసనీయ వర్గాలు చెప్పినట్టు నివేదిక పేర్కొంది. అయితే, పిల్లల పేరు లేదా ఇతర వివరాలను మాత్రం వెల్లడించలేదు.
అంతేకాదు, 2017- 2019 మధ్య రష్యన్ రహస్య సేవల గార్డుల సాయంతో కాటెరినా 50 కంటే ఎక్కువ సార్లు మ్యూనిచ్‌కు వెళ్లినట్టు ప్రయాణ వివరాలను కూడా నివేదికలో ప్రస్తావించారు. ఉక్రెయిన్‌పైకి రష్యా దండెత్తడంతో మాస్కోపై పశ్చిమ దేశాల ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షల జాబితాలో పుతిన్ కుమార్తెలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో మాస్కో- మ్యూనిచ్ మధ్య కాటెరినా ప్రయాణాలపై నిషేధం కొనసాగుతోంది.
ఇక, ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగిస్తున్న పుతిన్.. పాశ్చాత్య అనుకూల రష్యన్లపై బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. వారి మనసు అక్కడ ఉంది (పశ్చిమ).. ఇక్కడ కాదు (రష్యా) మా ప్రజలతో ఉండేవారు ద్రోహులు అని ఆరోపించారు. ఇదిలావుంటే ఉక్రెయిన్ భూభాగంపై విధ్వంసాన్ని సృష్టిస్తోన్న రష్యా.. క్షిపణులు, ఫిరంగులతో విరుచుకుపడుతోంది. సైన్యాల ఉపసంహరణ క్రమంలోనూ పెద్దఎత్తున ల్యాండ్‌మైన్లు రష్యా అమర్చి.. మరింత వినాశనానికి యత్నించినట్లు ఉక్రెయిన్ పలుసార్లు ఆరోపించింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా పేరుకుపోయిన ల్యాండ్‌మైన్లను తొలగించేందుకు కనీసం ఐదు నుంచి ఏడేళ్ల సమయం పడుతుందని ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల శాఖ డిప్యూటీ మంత్రి మేరీ హకోప్యాన్ తాజాగా వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa